ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఏలూరు(సెంట్రల్) : తమ్ముడు ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని బర్ల శివకృష్ణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం మండలం రామయ్యపేటకు చెందిన బర్ల శివకృష్ణ, మహేష్ అన్నదమ్ములు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్దనాన్న నాగేశ్వరరావు వద్ద ఉండి చదువుకుంటున్నారు. శివకృష్ణ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ట్రిపుల్ ఈ బ్రాంచి మూడో సంవత్సరం చదువుతున్నాడు. మహేష్ సీఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ఆ కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. శివకృష్ణ రెండేళ్ల క్రితం వరకు స్థానిక శాంతినగర్‌లోని ఓ రూమ్‌లో ఉండి చదువుకునే వాడు. వేసవి సెలవులు ఇచ్చినపుడు రూమ్ ఖాళీ చేసిన అతను తరువాత ప్రతిరోజు రామయ్యపేట నుండి డైలీ సర్వీస్ చేస్తున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం సుమారు 3గంటలకు శివకృష్ణ తన తమ్ముడి వద్దకు వెళ్లాడు. మహేష్ క్రికెట్ ఆడుకోవటానికి వెళుతున్నానని చెప్పడంతో శివకృష్ణ రూమ్‌లోకి(రూమ్ నెంబరు 62) వెళ్ళి తలుపుకు వేసుకున్నాడు. మహేష్ సాయంత్రం 4 గంటలకు హస్టల్‌కు వచ్చాడు. శివకృష్ణ ఎంత పిలిచిన, ఫోను చేసినా గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ తలుపు సందు నుంచి చూశాడు. శివకృష్ణ ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. కింద ఉన్న తోటి విద్యార్థులకు, హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తలుపును పగలగొట్టి లోపలకు వెళ్లారు. అప్పటికే శివకృష్ణ మరణించటంలో వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై డి.ప్రసాద్ కుమార్ హాస్టల్ వద్దకు చేరుకుని మృత దేహాన్ని కిందకు దింపి, పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రేమ వైఫల్యమే కారణమా!
శివకృష్ణ ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. శివకృష్ణ కాలేజీ బ్యాగ్‌లోని పుస్తకంలో ఉన్న కవితను, కీచెరుున్ను చూసిన పోలీసులు ప్రేమ విఫలం అవడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
నన్ను ఒంటరిని చేశాడు
చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారని, తనకంటూ ఉన్న అన్న శివకృష్ణ తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాడనుకోలేదని మహేష్ పోలీసుల ముందు భోరుమన్నాడు. అమ్మ నాన్న లేని లోటు రాకుండా పెదనాన్న, పెద్దమ్మ చూసుకుంటున్నారని, తన అన్న ఇలా చేస్తాదనుకోలేదన్నాడు.
తరచూ వస్తుండేవాడు
శివకృష్ణ తరచూ తన స్నేహితులతో కలసి మహేష్ హాస్టల్ గదికి వస్తుంటాడని హాస్టల్ సెక్యూరుటీ గోపాలరావు తెలిపాడు. అతను తన తమ్ముడుని కలసి వెళ్లిపోయేవాడని చెప్పారు.