కమలంతో జశ్వంత్ సింగ్ అమీతుమీ
జోధ్‌పూర్: బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ సింగ్ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. తన సొంత నియోజకవర్గం బార్మర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బార్మర్ బరిలో నిలిచేందుకే మొగ్గుచూపారు. తానిచ్చిన 48 గంటల గడువుకు బీజేపీ అధిష్టానం స్పందించకపోవడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తనకు తానుగా బీజేపీని వదిలిపెట్టడం లేదని జశ్వంత్ సింగ్ తెలిపారు. తన మద్దతుదారులు చెప్పినట్టే నడుచుకుంటున్నానని వెల్లడించారు.
కాగా, జశ్వంత్ సింగ్ కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వీంద్ర సింగ్.. తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచే అవకాశముందని సంకేతాలిచ్చారు. జశ్వంత్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా పలువురు బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆదివారం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. సమావేశం నిర్వహించి.. జశ్వంత్‌కు బార్మర్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.