barrage works
-
కొరాట–చనాఖా పనులు బంద్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దిగువ పెన్‌గంగపై నిర్మిస్తున్న కొరట–చనాఖా బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. ఎగువన మహారాష్ట్రలో కురిసిన తొలకరి వర్షాలకే వరద నీరు బ్యారేజీకి చేరింది. దీంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ బ్యారేజీ కోసం 23 పిల్లర్లు నిర్మిస్తుండగా, అవి చివరి దశకు వచ్చాయి. వర్షాకాలం కంటే ముందే పిల్లర్లు నిర్మించి స్లాబ్ వేద్దామనే ఆలోచనతో పనుల్లో వేగిరం పెంచినప్పటికీ వర్షాకాలం ప్రారంభంలోనే తొలకరి వర్షాలకే ఎగువ నుంచి వరదనీరు రావడంతో పనులు నిలిచిపోయాయి. వర్షాకాలం తర్వాత వరద ప్రభావం తగ్గిన తర్వాతే పనులు పునఃప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నల్లమట్టి నేల కావడం, నీళ్లలోకి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పనులు చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కాగా, పంప్‌హౌజ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పైపుల ద్వారా నీటిని తోడి బయటకు పంపి పనులు చేపట్టాలని భావిస్తున్నప్పటికీ, ఒకవేళ భారీ వర్షాలు పడితే మాత్రం పైపుల ద్వారా డీ–వాటరింగ్ కూడా చేసే పరిస్థితి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లోపు పూర్తి: జోగు రామన్న కొరాట–చనాఖా బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఉన్నప్పటికీ వరద రావడంతో పనులకు అంతరాయం ఏర్పడిందని మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం ఆయన కొరాట–చనాఖా బ్యా రేజీని సందర్శించి అక్కడి ఇబ్బందులను కాంట్రాక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజాగా గత రాత్రి కురిసిన వర్షానికి భారీగా వరదనీరు చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. అయినా వచ్చే ఎన్నికల్లోపు బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. వరుసగా మూడో ఏడాది.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కొరాట, మహారాష్ట్ర సరిహద్దులోని చనాఖా మధ్యలో పెన్‌గంగ నదిపై బ్యారేజీ నిర్మాణం కోసం 2016 మార్చిలో పనులను ప్రారంభించారు. బ్యారేజీతోపాటు పంప్‌హౌజ్, కాలువల నిర్మాణం చేపడుతున్నారు. 51 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ బ్యారేజీని చేపడుతున్నారు. పిల్లర్ల పనులు తుది దశకు చేరుకోగా, ఆ తర్వాత గేట్లు బిగించాలని అధికారులు ఆలోచన చేశారు. వరద రావడంతో పనులు నిలిచిపోయాయి. జైనథ్ మండలం హత్తిఘాట్ వద్ద 6 మోటార్లతో పంప్‌హౌజ్‌ను నిర్మిస్తున్నారు. 2016 జూన్‌లో పెన్‌గంగలో వరదనీరు రావ డంతో అప్పట్లో బ్యారేజీ పనులు నిలిచిపోయా యి. ఆ తర్వాత 2017 మేలోనే వరదనీరు చేరడంతో రెండోసారి పనులు నిలిచిపోయాయి. ఈ యేడాది జూన్ 7న మధ్యాహ్నం 12.30 గంట లకు బ్యారేజీని వరదనీరు తాకింది. -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
జైనథ్(ఆదిలాబాద్) : కోర్ట–చనాఖా బ్యారేజీ, హట్టిఘా ట్ పంప్‌హౌస్ పనులను గడువులోగా పూర్తి చేసేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి.దివ్యదేవరాజన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఆమె మండలంలోని కోర్ట–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్‌హౌస్, లోయర్ పెన్‌గంగ పనులు పరిశీలించారు. వచ్చే జూన్‌లోగా పనులు పూర్తి చేసేందుకు చేపడుతున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. కోర్ట–చనాఖా బ్యారేజీ వద్ద మొత్తం 22 పియర్స్(పిల్లర్ల) పనులు ప్రారంభించామని, అవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఇరిగేషన్ ఎస్ఈ అంజద్ తెలిపారు. పంప్‌హౌస్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మొత్తం పంప్‌ల ఏర్పాటు పూర్తయిందని, మోటార్లు బిగించడానికి కోసం వాల్ పనుల కొనసాగుతున్నాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లోగా పనుల పూర్తి చేసి ట్రయల్ రన్ చేపడతామని కలెక్టర్‌కు వివరించారు. బ్యారేజీ ద్వారా 13,500 ఎకరాలకు, పంప్‌హౌస్ ద్వారా 37,500 ఎకరాలకు కలిపి మొత్తం 51వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. దీనికోసం 47కిలోమీటర్ నుంచి 89 కిలోమీటర్ వరకు లోయర్ పెన్‌గంగ కెనాల్ నిర్మిస్తున్నామని, ఆ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పరిహారం పెంచాలని విన్నపాలు... కోర్ట–చనాఖా బ్యారేజీ భూ సేకరణ కోసం చెల్లించే పరిహారాన్ని పెంచాలని నిర్వాసితులు కలెక్టర్‌కు విన్నవించారు. బ్యారేజీ పరిశీలనకు వచ్చిన కలెక్టర్‌ను కోర్ట గ్రామస్తులు కలిశారు. బ్యారేజీ కోసం మొదటి విడతలో 126 ఎకరాలు సేకరించారని, గరిష్టంగా ఎకరానికి రూ.5.75లక్షలు మాత్రమే చెల్లించారని అన్నారు. మహారాష్ట్ర భూములు రూ.11లక్షల వరకు చెల్లించారని అన్నారు. ప్రస్తుతం రెండవ విడతలో మరో 32 ఎకరాలు సేకరిస్తున్నారని, తమకు కూడా ఎకరానికి రూ.11లక్షల పరిహారం అందించాలని కోరారు. బ్యారేజీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి, గ్రామంలో రోడ్డు వెంబడి ఉన్న కుటుంబాలకు డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇస్తామని చెప్పారని.. ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. బ్యారేజీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం రాకుండా పూర్తి ఊరినే తరలించాలని, మొత్తం 200 డబుల్ బెడ్రూంలు మంజూరు చేస్తే, వేరే చోటు ఇళ్లు నిర్మించుకుంటామని అన్నారు. జిల్లా నీటి పారుదల శాఖ అధికారి సుశీల్‌కుమార్, ఆర్డీవో సూర్యనారాయణ, డీఈ మనోహర్, ఏఈఈలు సుజాత, శృతి, నాయకులు బొల్లు అడెల్లు, మహేష్ పాల్గొన్నారు. -
వచ్చే వేసవిలోగా బ్యారేజీ పనులు
మంత్రి హరీశ్‌రావు జైనథ్: తెలంగాణ, మహారాష్ట్రలోని కోర్ట, చనాక గ్రామాల మధ్య పెన్‌గంగ నదిపై నిర్మించనున్న బ్యారేజీ పనులు వచ్చే వేసవికి ముందే ప్రారంభిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, రాథోడ్ బాపురావు, విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జగన్మోహ న్‌తో కలసి మహారాష్ట్రలోని చనాక గ్రామంలో పర్యటించారు. బ్యారేజీ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే లోయర్ పెన్‌గంగ, పెన్‌గంగపై తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య మూడు బ్యారేజీల నిర్మాణానికి పూనుకుందని అన్నారు. సగ్దసాంగిడి, పింప్రడ్ బ్యారేజీలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుండగా, కోర్ట, చనాక బ్యారేజీని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.300 కోట్లతో ఈ బ్యారేజీ పనులను పూర్తి చేసి ఇరు రాష్ట్రాల్లో తాగు, సాగునీరు వసతులను కల్పిస్తామని అన్నారు. కోర్ట, చనకా బ్యారేజీ ద్వారా తెలంగాణలోని జైనథ్, బేల మండలాల్లో 12,500 ఎకరాలకు, మహారాష్ట్రలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ బ్యారేజీకి సంబంధించిన డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేశామని.. ఈ నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించి అన్ని అనుమతులు పూర్తి చేసుకుని త్వరలోనే రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ భగవంత్‌రావు, మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.