సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దిగువ పెన్‌గంగపై నిర్మిస్తున్న కొరట–చనాఖా బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. ఎగువన మహారాష్ట్రలో కురిసిన తొలకరి వర్షాలకే వరద నీరు బ్యారేజీకి చేరింది. దీంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ బ్యారేజీ కోసం 23 పిల్లర్లు నిర్మిస్తుండగా, అవి చివరి దశకు వచ్చాయి.
వర్షాకాలం కంటే ముందే పిల్లర్లు నిర్మించి స్లాబ్ వేద్దామనే ఆలోచనతో పనుల్లో వేగిరం పెంచినప్పటికీ వర్షాకాలం ప్రారంభంలోనే తొలకరి వర్షాలకే ఎగువ నుంచి వరదనీరు రావడంతో పనులు నిలిచిపోయాయి. వర్షాకాలం తర్వాత వరద ప్రభావం తగ్గిన తర్వాతే పనులు పునఃప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నల్లమట్టి నేల కావడం, నీళ్లలోకి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పనులు చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కాగా, పంప్‌హౌజ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పైపుల ద్వారా నీటిని తోడి బయటకు పంపి పనులు చేపట్టాలని భావిస్తున్నప్పటికీ, ఒకవేళ భారీ వర్షాలు పడితే మాత్రం పైపుల ద్వారా డీ–వాటరింగ్ కూడా చేసే పరిస్థితి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
వచ్చే ఎన్నికల్లోపు పూర్తి: జోగు రామన్న
కొరాట–చనాఖా బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఉన్నప్పటికీ వరద రావడంతో పనులకు అంతరాయం ఏర్పడిందని మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం ఆయన కొరాట–చనాఖా బ్యా రేజీని సందర్శించి అక్కడి ఇబ్బందులను కాంట్రాక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజాగా గత రాత్రి కురిసిన వర్షానికి భారీగా వరదనీరు చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. అయినా వచ్చే ఎన్నికల్లోపు బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.
వరుసగా మూడో ఏడాది..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కొరాట, మహారాష్ట్ర సరిహద్దులోని చనాఖా మధ్యలో పెన్‌గంగ నదిపై బ్యారేజీ నిర్మాణం కోసం 2016 మార్చిలో పనులను ప్రారంభించారు. బ్యారేజీతోపాటు పంప్‌హౌజ్, కాలువల నిర్మాణం చేపడుతున్నారు. 51 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ బ్యారేజీని చేపడుతున్నారు. పిల్లర్ల పనులు తుది దశకు చేరుకోగా, ఆ తర్వాత గేట్లు బిగించాలని అధికారులు ఆలోచన చేశారు.
వరద రావడంతో పనులు నిలిచిపోయాయి. జైనథ్ మండలం హత్తిఘాట్ వద్ద 6 మోటార్లతో పంప్‌హౌజ్‌ను నిర్మిస్తున్నారు. 2016 జూన్‌లో పెన్‌గంగలో వరదనీరు రావ డంతో అప్పట్లో బ్యారేజీ పనులు నిలిచిపోయా యి. ఆ తర్వాత 2017 మేలోనే వరదనీరు చేరడంతో రెండోసారి పనులు నిలిచిపోయాయి. ఈ యేడాది జూన్ 7న మధ్యాహ్నం 12.30 గంట లకు బ్యారేజీని వరదనీరు తాకింది.
Comments
Please login to add a commentAdd a comment