Basava tarakam cancer hospital
-
పట్టెడన్నం కోసం.. ప్రాణాలే పణంగా!.. ఏడాదిలోనే 17 మంది మృతి
బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి చౌరస్తాతోపాటు ఆ ప్రాంత రహదారులు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఇక్కడ నిత్యకృత్యం కాగా మృతుల కుటుంబాలు సైతం ఆగమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు నిత్యం బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్దకు ఆహార పదార్థాలను తీసుకొస్తుంటాయి. ఆకలి తీర్చుకునేందుకు ఆతృతతో రోడ్డు దాటేందుకు యత్నిస్తున్న రోగుల బంధువులు, యాచకులను అవతలి వైపు నుంచి వస్తున్న వాహనాలు ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు మృత్యువాతా పడుతున్నారు. ఇలా గత ఏడాది ఇక్కడ రోడ్డు ప్రమాదాల బారిన పడి 17 మంది అమాయకులు మరణించడం అందరి హృదయాలను కలచివేసే అంశం. మరో వంద మంది వరకు పలు ప్రమాదాల్లో గాయపడి మంచానపడ్డారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సగటున రోజుకొకటి చొప్పున రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతున్నాయి. గ్రామాల నుంచి వస్తున్న రోగుల సహాయకులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదకరంగా వాహనాల మధ్య రోడ్డు దాటుతున్న రోగుల బంధువులుసూచికలేవి? ►బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద రోజూ 20 నుంచి 30 మంది వరకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్నదానం చేస్తుంటారు. ప్రముఖుల పుట్టిన రోజులు, వర్ధంతుల సందర్భంలో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ►ఓ సంస్థ అయితే ఇక్కడ రోజూ అన్నదానం చేస్తుంది. ►ఆయా సందర్భాల్లో సుమారు 300 మంది వరకు యాచకులు, 200 మంది వరకు రోగుల సహాయకులు ఆహార పదార్థాలను స్వీకరిస్తుంటారు. అన్నదానం చేసేందుకు వచ్చిన వాహనాల వద్దకు ఆకలితో ఉన్న అభాగ్యులు రోడ్డుపై వస్తున్న వాహనాలను పట్టించుకోకుండా పరుగులు తీస్తుంటారు. దీంతో వారు ప్రమాదాల బారిన.. ఒక్కోసారి మృత్యువాతా పడుతున్నారు. ఆహారం పంపిణీ చేస్తున్న ప్రాంతంలో పరిస్థితి ఇలా... ►తెలంగాణ భవన్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మలుపు వద్ద రోడ్డు దాటే వారిని ఢీకొడుతున్నారు. ►నందినగర్ వైపు నుంచి కేబీఆర్ పార్కు వైపు బస్ స్టాప్లకు వరద నీరు వెళ్లేందుకు సెంట్రల్ మీడియన్‌ను తవ్వారు. ఈ గోతిలో నుంచే చాలా మంది అటూ ఇటు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ► దీనికి తోడు స్టడీ సర్కిల్ ఎదుట యూటర్న్ ఉందనే విషయం సిగ్నళ్ల ద్వారా తెలపాల్సి ఉంది. ఎలాంటి సిగ్నల్ ఏర్పాటు చేయలేదు. ►ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు దాటే వారిని అప్రమత్తం చేసేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అయితే అలాంటివి ఏమీ ఉండవు. సమన్వయమేది? ►ప్రమాదకరంగా ఉన్న బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ఇష్టమొచి్చనట్లుగా రోడ్డు దాటడం, సెంట్రల్ మీడియన్‌లో ప్రమాదకరంగా రాకపోకలు సాగేలా సందులు ఏర్పాటు చేయడం, సెంట్రల్ మీడియన్‌లోని పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ►జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. ఈ రెండు విభాగాలు సమన్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ►బంజారాహిల్స్ పోలీసులు ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది. ఇకనైనా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి ఇక్కడ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అపోలో, బసవతారకంలో ఉచిత వైద్యం అందించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అపోలో, బసవతారకం కేన్సర్ ఆస్పత్రులు.. ఉచిత ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీనిపై డీఎంహెచ్ఓ పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. ఈ మేరకు తాజా జీవో ప్రతిని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర సర్కార్ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్న టైంలో.. జరిగిన ఎంవోయూల మేరకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్ మానెక్షా డెబారా, తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ‘ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది. ఇక బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ ఈ నెల 16న రాష్ట్ర సర్కార్ మరో జీవో 80 జారీ చేసింది’అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8న వాయిదా వేసింది. జీవో 80లోని ముఖ్యాంశాలు ♦ అపోలో, నందమూరి బసవతారకం మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రులు వరుసగా 15%, 25% పడకలను పేదల కోసం కేటాయించాలి. ♦ ఇది దాతృత్వం కాదు.. ఇది వారి కర్తవ్యం. ♦ ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం తక్కువ ధరకు ఇచ్చింది. ♦ ప్రధాన మంత్రి జీవన్ ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి. ♦ బసవతారకం ఆస్పత్రి 40% పేదలకు తప్పకుండా ఓపీ సేవలు ఉచితంగా అందించాలి. ♦ ఇవన్నీ సరిగా అమలవుతున్నాయా.. లేదా.. అన్నది డీఎంహెచ్ఓ అప్పుడప్పుడు పరిశీలించి ధ్రువీకరించాలి. ♦ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డుదారులు ఉచిత ఓపీకి అర్హులు. ఇదీ చదవండి: ఇక అరచేతిలో ఆర్టీసీ బస్సు -
అయ్యో తరుణ్.. మూడేళ్లకే ఇంత కష్టమా..
బుడిబుడి అడుగులతో అల్లరి చేయాల్సిన తరుణ్ అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆటపాటలతో అల్లరి చేయాల్సిన వాడు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. పుట్టిన మూడేళ్లకే ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడ్డాడు. నవ్వుల తరుణ్ ప్రసవం జరిగింది మొదలు స్రవంతికి ఆమె కొడుకే ప్రాణంగా బతుకుతోంది. బిడ్డను వదిలి క్షణం కూడా ఉండలేకపోయేది. నిరంతరం పిల్లాడితే గడిపేయడంతో బాబుకి ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు చిరాకు పడుతున్నాడనే విషయాలను వెంటనే గుర్తించేది. అతడి బోసి నవ్వులు చూసి మురిసిపోయేది. ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా భర్త తెచ్చే సంపాదన అంతంత మాత్రమే. అయితే స్రవంతి ముద్దుల కొడుకు తరుణ్ అల్లరితో ఆ ఇంట్లో సుఖశాంతులకు లోటు లేకుండా పోయింది. క్యాన్సర్ ఎప్పుడు యాక్టివ్‌గా అల్లరి చేసే తరుణ్ కొంత కాలంగా నీరసంగా ఉండటం స్రవంతి గమనించింది. తరచి చూస్తే ఒళ్లు వేడిగా ఉంటున్నట్టు గుర్తించింది. వెంటనే తరుణ్‌ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ నీరసం ఇంకా ఎక్కువైంది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్తే రకరకాల పరీక్షలు చేశారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తుండటంతో వ్యాధి నిర్థారణ కోసం హైదరాబాద్ వెళ్లాలంటూ సూచించారు. రూ. 20 లక్షలు కావాలి తరుణ్‌కి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు చెప్పిన విషయం విన్న స్రవంతికి గుండె ఆగినంత పనైంది. తన ముద్దుల కొడుక్కి ప్రాణాంతకమైన మైలోమియా లుకేమియా క్యాన్సర్ ఉన్నట్టుగా వైద్యులు తేల్చి చెప్పారు. వెంటనే కీమోథెరపీ చేయకపోతే బిడ్డ మృత్యువుకు చేరువ అవుతాడంటూ హెచ్చరించారు. సాధ్యమైనంత త్వరగా వైద్య చికిత్స కోసం రూ.20లక్షలు సర్థుబాటు చేసుకోవాలంటూ సూచించారు. సాయం చేద్దాం రండి రెక్కాడితే గానీ డొక్కాడని స్రవంతి కుటుంబానికి రూ.20 లక్షలు సర్థుబాటు చేయడం కలలో కూడా జరగని పని. అలా అని బిడ్డ మృత్యు ఓడికి చేరుతుంటే చూస్తూ ఊరుకోలేక పోతుంది. కళ్లలో నీళ్లు ఇంకేలా ఏడుస్తూనే ఉంది. చివరకు బిడ్డ వైద్య చికిత్స కోసం ఫండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మూడేళ్ల తరుణ్ ఈ లోకంలో అందాలను చూడాలంటే అతనికి భవష్యత్తును అందివ్వాలంటే మనమంతా తలా ఓ చేయి వేయాల్సిన అవసరం ఏర్పడింది. సాయం చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి -
నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో నైట్ షెల్టర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించేందుకు వెంటనే వంద బృందాలను నియమించాల్సిందిగా జీహెచ్ంఎసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ (సోమవారం) రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ బృందాలు రంగంలోకి దిగి, నిలువనీడలేక రోడ్లపైన, పార్కుల్లోనూ నిద్రిస్తున్న వారు ఏయే ప్రాంతాల్లో ఎక్కువమంది ఉన్నారో సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. సోమవారం యూసీడీ విభాగ కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనన్ని నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు మూడు ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలుపగా.. ఎక్కువమంది ఉన్న ప్రాంతాల్లో నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు తగిన స్థలాల్ని, అందుబాటులో ఉన్న భవనాల్ని గుర్తించాల్సిందిగా సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వెంటనే నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. భవనాలు అందుబాటులో ఉంటే వాటిలోనూ, బహిరంగ ప్రదేశాలుంటే అక్కడా కొత్తగా నిర్మిస్తామన్నారు. ప్రస్తుతానికి బేగంపేట ఫ్లై ఓవర్ దిగువన రెండు నైట్ షెల్టర్లు, బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద తాత్కాలిక నైట్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నవంబర్‌లో నిలువనీడలేక చలికి గిజగిజలాడుతున్న వారి గురించి ‘సాక్షి’ లో వెలువడిన కథనంతో వెంటనే స్పందించిన కమిషనర్.. త్వరలోనే వీలైనన్ని నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక షెల్టర్ ఏర్పాటుకు క్యాన్సర్ ఆస్పత్రి వారితో మాట్లాడారు. యువతకు ఉపాధి.. నిరుద్యోగ యువతకు ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించి వారి ఉపాధికి ఉపకరించే కార్యక్రమాలు చేపట్టేందుకు జోన్‌కొక ప్రత్యేక విభాగం(జీవనోపాధి) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లకు సూచించారు. వాటి ద్వారా సర్కిల్‌కు వెయ్యిమందికి శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఇందుకు తగు స్థలాల్ని గుర్తించాలన్నారు. ఏయే అంశాల్లో శిక్షణనిచ్చేది ఈ నెల 18లోగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా సూచించారు. సమావేశంలో స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ (యూసీడీ) జయరాజ్ కెన్నెడి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.