యువతా.. ఓటే భవిత
సాక్షి, సంగారెడ్డి: యువతా మేలుకో..ఓటే మన భవితకు పునాది. అవినీతి నేతలకు చరమగీతం పాడాలంటే ఓటే ఆయుధం..అందుకని ఇప్పటికీ ఓటులేని వాళ్లు రా నున్న రెండు రోజుల్లో ఓటరుగా నమోదు కావాల్సిందే. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. గత నెల 18న ముసాయిదా జాబితాను సైతం ప్రచురించారు. తుది జాబితా ప్రచురణకు కసరత్తు జరుగుతోంది. బూత్‌స్థాయి పోలింగ్ కేంద్రాలు, తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పా టు చేసి ఓటరు నమోదు, ఇతర మార్పు చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకుంటేనే ఈ జాబితాలో చోటు లభించనుంది. తుది గడువులోగా వచ్చిన దరఖాస్తులపై ఈ నెల 31లోగా విచారణ పూర్తి చేసేసి, జనవరి 16న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ ఓటరు జాబితాయే 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు మున్సిపల్, జడ్పీ ఎన్నికలకు కీలకం కానుంది.
మహిళలు వెనకడుగు ..
ముసాయిదా ఎన్నికల జాబితా, 2011 జనాభా లెక్కలను పోల్చి చూస్తే.. జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య.. వారి జనాభా కంటే 13.44 శాతం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. బోగస్ ఓట్లు, చనిపోయిన ఓ టర్లను జాబితా నుంచి తొలగించకపోవడంతో భా రీ వ్యత్యాసం వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. అ యితే, మహిళా ఓటర్ల పరిస్థితి విరుద్ధంగా తయారైంది. మహిళా ఓటర్ల సంఖ్య.. వారి జనాభాతో పోలిస్తే 9.8 శాతం తక్కువగా ఉంది. ముసాయిదా జాబితా ప్రకారం.. జిల్లాలో మొత్తం 20,78,100 ఓటర్లుండగా.. అందులో 10,49,604 పురుష ఓటర్లు, 10,28,426 మహిళా ఓటర్లు, 70 మంది ఇతర ఓటర్లున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం చూసినా, జనాభా లెక్కల ప్రకారం విశ్లేషించినా జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో మహిళా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.
స్వీప్ సక్సెస్
ఓటరు నమోదుపై యువతీ, యువకల్లో చైతన్యం కల్పించడానికి నిర్వహించిన ‘స్వీప్’ కార్యక్రమానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలోనే సత్ఫలితాలు వచ్చాయి. దాదాపు 37 వేల కొత్త ఓటర్లను ఈ కార్యక్రమం ద్వారా నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ సూచన మేరకు జిల్లా యంత్రాంగం స్వీప్‌లో జాతీయస్థాయి పురస్కారం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించింది.