సెల్ కొనేది ‘సెల్ఫీ’ కోసమే..!
♦ మారుతున్న వినియోగదారుల ధోరణి
♦ హైపవర్ ఫ్రంట్ కెమెరాలతో కంపెనీల మోడళ్లు
♦ స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 50% సెల్ఫీ ఆధారితమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘సెల్ఫీ లేలే రే’ అంటూ బజరంగీ భాయ్‌జాన్ సినిమాలో సల్మాన్‌ఖాన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పాటే కాదు... ఇపుడు సెల్ఫీ పోటీలూ పుట్టుకొచ్చాయి. రోజుకో సెల్ఫీ తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం.. వీటికి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో తీసుకున్న సెల్ఫీలు తోడవటం... స్నేహితులు, బంధువులు, ఆప్తులు ఒకచోట కలిసినా, అందమైన ప్రదేశానికి వెళ్లినా.. అపురూప క్షణాలను, జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలన్నా.. ‘ఒక్క సెల్ఫీ’ క్లిక్మనిపించటం... అంతా సాధారణమైపోయింది. ఇంతలా ఇండియా మొత్తం సెల్ఫీమయమైపోవటంతో మొబైల్ ఫోన్ కంపెనీలూ రంగంలోకి దిగాయి. పోటాపోటీగా హై రిసొల్యూషన్ ఫ్రంట్ కెమెరాలతో మారె ్కట్ను చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్లాష్, ఆటో ఫోకస్ ఫీచర్లనూ చేరుస్తున్నాయి.
హై రిసొల్యూషన్తో..
గతంలో ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీ, హై రిసొల్యూషన్ బ్యాక్ కెమెరా, అధిక ర్యామ్ వంటి ఫీచర్లే కస్టమర్ల తొలి ప్రాధాన్యాలుగా ఉండేవి. కంపెనీలు అందుకు అనుగుణంగా ఈ ఫీచర్లపైనే ఎక్కువ ఫోకస్ చేసేవి. ఈ జాబితాలోకిపుడు ఫ్రంట్ కెమెరా కూడా చేరింది. గతంలో వీడియో కాల్స్‌కే పరిమితమైన ఫ్రంట్ కెమెరాలు... ఇపుడు సెల్ఫీ సెంటర్లయిపోయాయి. దీంతో హై రిసొల్యూషన్తో 13 మెగా పిక్సెల్ వరకు వచ్చేశాయి. సోని, హెచ్‌టీసీ, ఆసస్, ఇన్ఫోకస్లు ఈ స్థాయి కెమెరాలతో మోడళ్లను విక్రయిస్తున్నాయి. సెల్కాన్ వీటి సరసన చేరగా... లెనొవో రెండు ఫ్రంట్ కెమెరాలతో వైబ్ ఎస్1 మోడల్‌ను రూపొందించింది. ఎల్జీ వీ10కు 5 ఎంపీతో రెండు ఫ్రంట్ కెమెరాలున్నాయి. ఇక 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో గూగుల్ నెక్సస్, ఎల్జీ, హువావె, జెడ్‌టీఈ, ప్యానసోనిక్, జియోనీ, షావొమీ, వన్‌ప్లస్, లెనొవో, లావా, ఇంటెక్స్, కార్బన్, ఓపో, హానర్, ఏసర్ పోటీపడుతున్నాయి. రూ.8 వేల నుంచే ఈ ఫోన్లు లభిస్తుండటం విశేషం.
బేసిక్ ఫోన్లలోనూ...
సెల్ఫీ క్రేజ్ బేసిక్ ఫోన్లకూ పాకింది. నోకియా ఎల్ఈడీ ఫ్లాష్‌తో 2 ఎంపీ కెమెరాతో 230 మోడల్‌ను ప్రవేశపెట్టింది. సెల్కాన్ కాస్త వినూత్నంగా ఫ్లాష్‌తో కూడిన రొటేటబుల్ కెమెరా ఫోన్స్‌ను చార్మ్ స్పిన్, సీ360 ట్విస్ట్ పేరుతో విజయవంతంగా విక్రయిస్తోంది. అలాగే సెల్ఫీ కెమెరాతో సీ225 స్టార్, సీ289 మోడళ్లను తీసుకొచ్చింది. హువావె, ఇంటెక్స్, కార్బన్, జెన్, వీడియోకాన్ సైతం ఫ్రంట్ కెమెరాతో బేసిక్ ఫోన్లను ప్రవేశపెట్టాయి. కాగా, ‘సెల్ఫీ’ ఫోన్లంటూ దాదాపు అన్ని కంపెనీలు బ్రాండింగ్ చేసుకుంటున్నాయి. రిటైల్ ఔట్లెట్లలో సెల్ఫీ మోడళ్లు బెస్ట్ సెల్లర్స్‌గా నిలుస్తున్నాయని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
సెల్ఫీ కెమెరానే ప్రాధాన్యత..
యూత్ అంతా ఇప్పుడు సెల్ఫీ మోడళ్లకే సై అంటున్నారని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ప్రస్తుతం 8 ఎంపీ మోడళ్లను తెచ్చామని, త్వరలో 4జీలో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా మోడల్‌ను ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు సమయంలో కస్టమర్లలో 50-60 శాతం మంది సెల్ఫీ గురించి మాట్లాడుతున్నారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలదే హవా అంటూ.. సెల్ఫీ స్టిక్స్‌కు కూడా క్రేజ్ పెరిగిందన్నారు. భారత్‌లో జనవరిలో మొత్తం 2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 70 శాతం. విక్రయమైన స్మార్ట్ఫోన్లలో 50 శాతం సెల్ఫీ ఆధారిత మోడళ్లున్నాయని లాట్ మొబైల్స్ ఈడీ కృష్ణ పవన్ తెలిపారు.