స్వచ్ఛ భారత్ వైపు ఇందూరు పయనం!
♦ 2012 బేస్‌లైన్ సర్వే ఆధారంగా కార్యక్రమం
♦ ఇప్పటికే ఓడీఎఫ్ గ్రామాలుగా 65 గుర్తింపు
♦ రెండు రోజుల జాతీయ సదస్సుకు కలెక్టర్
♦ ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ యోగితారాణా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిజామాబాద్‌ను పూర్తి పారిశుధ్య జిల్లాగా రూపొందించేందుకు చేపట్టిన చర్యలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు సమష్టిగా గ్రామ పంచాయతీలను యూనిట్లుగా తీసుకొని ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వినియోగంపై కూడా కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.12 వేల యూనిట్ విలువతోనే నిర్ణీత కొలతలతో మరుగుదొడ్డి నిర్మాణంతోపాటు స్నానపు గదులను కూడా మంజూరు చేయటంపై గ్రామీణ కుటుంబాలు స్వచ్ఛభారత్ అమలులో భాగస్వాములవుతున్నాయి. మరుగుదొడ్ల వాడకంపై ఆసక్తిని పెంచి, పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బకెట్లు, ఫినారుుల్, బ్రేష్లను అందించేందుకు ప్రతి లబ్ధిదారుల నుంచి రూ.900లు సేకరించి గ్రామ జ్యోతి కమిటీలలో జమ చేశారు.
అలాగే గ్రామాలను, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు ఇంటింటికీ మ్యాజిక్ సోక్పిట్లు, చేతిపంపుల వద్ద కమ్యూనిటీ సోక్ పిట్లు మంజూరు చేసి ఇళ్లలో వాడుకొని వదిలివేసిన నీటిని ఇంకిపోయే విధంగా చేయడంతోపాటు ఇళ్లలో ఉన్న చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డులను చేపట్టడం జరిగింది. ఇళ్లలోని చెత్తను తొలగించేందుకు రిక్షాలను గ్రామ పంచాయతీలకు అందచేస్తున్నారు.