ఆయన జీవితం ఆదర్శం
కడప కల్చరల్:అసమానతలు లేని సమాజమే ధ్యేయంగా బసిరెడ్డి జీవించారని.. ఆయన జీవితం అందరికీ ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, జిల్లా రాజకీయ దురంధరుడు, దివంగత నేత పెంచికల బసిరెడ్డి 105వ జయంతి ఉత్సవాన్ని ఆదివారం కడప జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు డాక్టర్ ఎ.చక్రపాణి మాట్లాడుతూ బసిరెడ్డి తన న్యాయవాద వృత్తిలోనూ,రాజకీయ, ప్రజా సేవా రంగాల్లోనూ నిజాయితీకి మారుపేరుగా నిలిచి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసిం చారు. బసిరెడ్డిలాంటి వారితోనే ప్రజాస్వామ్యంలో స్థిరత్వం ఏర్పడిందన్నారు. భావితరాలలో ఆయన స్ఫూర్తిని నిం పేందుకు ఈ ఉత్సవాలు వేదిక కావడం హర్షణీయమన్నారు. ట్రస్టు ఏర్పాటుకు సూచించిన జస్టిస్ నాగార్జునరెడ్డి అభినందనీయుడని, ట్రస్టుకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు.
బంధాన్ని గుర్తుచేసుకుంటూ...
జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బసిరెడ్డి తో తమకు గల బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉండింటే నేడు రాష్ట్రానికి ఈ దుర్గతి దాపురించేది కాదని డాక్టర్ మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, ఇలాంటి సభల ద్వారా ఆయన పాటించిన విలువల పునరుద్ధరణకు కృషి చేద్దామని వరదరాజులరెడ్డి అన్నారు. డాక్టర్ శివరామకృష్ణయ్య, ఎమ్మెల్సీ చెంగల్రాయులు, జిల్లా ప్రముఖులు శంకర్‌రెడ్డి మాట్లాడారు.
సభ ప్రారంభమైందిలా..
జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి బసిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సభను ప్రారంభించగా, ఎస్ఎస్ నాగార్జునరెడ్డి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి సంచిక విశేషాలను తెలుపగా, కార్యక్రమ సమన్వయకర్త సీహెచ్ సిద్దారెడ్డి అతి థులను సభకు పరిచయం చేశారు. ఆళ్లూరి వెంకట య్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బసిరెడ్డి కుమారు డు, కుటుంబ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరిం చారు.ఎమ్మెల్సీనారాయణరెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజోలి వీరారెడ్డి, టీడీపీ నాయకులు సతీష్‌రెడ్డి, వాసు, వైవీయూ వీసీ శ్యాం సుందర్ పాల్గొన్నారు.
మంచివైపు మళ్లిద్దాం..
బసిరెడ్డిలాంటి ఆదర్శ వ్యక్తుల స్ఫూర్తితో సమాజాన్ని మంచి వైపు మళ్లించేందుకు నిస్వార్థంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజంలోని మంచిని కాపాడుకోవాలంటే బసిరెడ్డిలాంటి వారిని స్మరించుకోవాలన్నారు. సునిశిత విమర్శలు: జస్టిస్ నాగార్జున రెడ్డి సమాజంలో ప్రస్తుత తీరుతెన్నుల పట్ల సునిశిత విమర్శలు సంధించారు. సమాజం భ్రష్టు పట్టడానికి లోపభూయిష్టమైన విద్యావిధానమే ముఖ్య కారణమన్నారు. నేటితరం తల్లిదండ్రులు బిడ్డలను ధనసంపాదనే ధ్యేయంగా పెంచుతున్నారని, సమాజానికి పనికొచ్చే వారిగా పెంచేవారు కరువయ్యారన్నారు. ఇటీవల స్కాములు ఎక్కువయ్యాయని, ఇవి పాముల కంటే ప్రమాదమైనవని దుయ్యబట్టారు.
ట్రస్టుకు రూ. లక్ష విరాళం: బసిరెడ్డిలాంటి ఆదర్శ సేవకులను స్మరించుకునేందుకు ఆయన పేరిట సమాజ సేవ కార్యక్రమాలను నిర్వహించేందుకు వారి గురించి పుస్తకాలు ప్రచురించి భావితరాల్లో స్ఫూర్తినింపేందుకు జిల్లా స్థాయిలో బసిరెడ్డి పేరిట ట్రస్టు ఏర్పాటు చేయాలని జస్టిస్ నాగార్జునరెడ్డి సూచించారు. బస్టిస్ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ట్రస్టు ఏర్పాటు చేయాలని కోరుతూ తనవంతుగా చిరు మొత్తాన్ని స్వీకరించాలని లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
‘సీమ’ అభివృద్ధికి కృషి
రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన సీమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన బసిరెడ్డి పదవులకన్నా ప్రజాసేవనే గొప్పగా భావించారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల గురించి నేటితరానికి తెలిపేందుకు ఆయన కుమారుడు రఘునాథరెడ్డి ఈ వేడుక నిర్వహిస్తున్నారన్నారు.
బసిరెడ్డికి ఘన నివాళి
స్వాతంత్య్ర సమరయోధులు దివంగత నేత పెంచికల బసిరెడ్డి 105వ జయంతి సంద ర్భంగా రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు డాక్టర్ ఎ.చక్రపాణి ఆయన విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు. ఆదివారం సంధ్య సర్కిల్లోని బసిరెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఆయన పూలమాలలు వేశారు. హైకోర్టు జస్టిస్ నాగార్జున రెడ్డి, హైకోర్టు విశ్రాంత జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, బసిరెడ్డి కుమారుడు రఘనాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, ఎస్వీ సతీష్‌రెడ్డి కూడా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.