ఆయన బాత్రూంలలోకి తొంగిచూస్తారు: రాహుల్
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోట్ వేసుకుని బాత్రూంలో స్నానం చేస్తారన్న మోదీ వ్యాఖ్యలకు బదులుగా.. జనాల బాత్రూంలలోకి తొంగిచూడటం మోదీకి అలవాటని రాహుల్ ఎద్దేవా చేశారు. లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి కామన్ మినిమమ్ ప్రోగ్రాం పేరిట పది అంశాలతో కూడిన ఎజెండాను విడుదల చేసే సందర్భంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఇక ఉన్నది రెండున్నరేళ్లేనని, ఆయన జాతకం బయటపెట్టాలని అన్నారు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానాలు చెప్పలేకపోతే ఆయన విరుచుకుపడతారని అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో మోదీ దారుణంగా విఫలమయ్యారని రాహుల్ చెప్పారు. ఇక సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు విషయంలో ఆరేడు సీట్ల విషయంలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరించుకుంటామని తెలిపారు. 99 శాతం సీట్లు సాధించుకోడానికే ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు.
ఇక ప్రజలు ఇప్పటికీ అచ్ఛేదిన్ కోసం ఎదురు చూస్తున్నారని, కొంతమంది మన్‌కీ బాత్ చెబుతున్నారు గానీ కామ్ కీ బాత్ చెప్పడం లేదని అఖిలేష్ అన్నారు. ఇవి ఎన్నికలని.. ఎవరూ భావోద్వేగాలకు, కోపానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు.