‘బరాక్ 8’ విజయవంతం
ముంబై: యుద్ధ నౌకల్లో ఉపయోగించే మరో క్షిపణిని భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే 70 కిలోమీటర్ల పరిధి(రేంజ్) ఉన్న బరాక్ 8 క్షిపణిని ‘ఐఎన్ఎస్ కోల్కతా’ నౌకలో పరీక్షించింది. దీన్ని భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధిపరిచాయి. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణుల్లో ఇది అత్యంత పరిధి కలిగి ఉందని నేవీ అధికారులు పేర్కొంటున్నారు.
అరేబియా మహా సముద్రంలో మంగళవారం, బుధవారం రెండు క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. దీంతో పాటు క్షిపణులను గుర్తించి, ప్రమాదాలను పసిగట్టే రాడార్ వ్యవస్థను కూడా అభివృద్ధిపరిచారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా 250 కిలోమీటర్లకు పైగా పరిధిలో వందలాది శత్రు క్షిపణులు, అనుమానాస్పద విమానాలు, డ్రోన్లను ఒకేసారి గుర్తించవచ్చు.