మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడికి పోలీసు అధికారుల సంఘం వార్నింగ్
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడి వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెంగల్రాయుడిని చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, సోమవారం పోలీసుల అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. చెంగల్రాయుడు పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండించని చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాము. ఊడిపోవడానికి మా యూనిఫామ్స్ ఏమీ ఖద్దరు దుస్తులు కావు. ఇంకోసారి మమ్మల్ని అవమానిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
అంతకుముందు.. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు పోలీసులను దుర్భాషలాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలో రెచ్చిపోయి మాట్లాడారు. రైల్వేకోడూరుకు చెందిన పోలీసు నా కొడుకులు ఫోన్చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, బెదిరించాలని సలహా ఇచ్చారు.
‘పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధాలు చెప్పండి. పోలీసులు ఎగిసెగిసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటులో ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారు. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి’ అంటూ కార్యకర్తలకు ఆయన సలహాలిచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు.