సీఎంతో మూడు విషయాలపై చర్చించా: పవన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించినట్లు జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అభివృద్ధి మొత్తం ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకరించడం.. ఈ మూడు అంశాలపై సీఎంతో చర్చించినట్లు ఆయన చెప్పారు. పవన్ ఇంకా ఏమన్నారంటే..
సీఎంను కలుసుకోడానికి ముఖ్యకారణం.. అమరావతి శంకుస్థాపనకు నేను రాలేకపోయాను
అందుకే ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను
దాంతోపాటు కొన్ని విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాను
రాజధానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి
ఆయన కూడా బలవంతంగా భూసేకరణ వద్దని, వారు అనుమతిస్తేనే తీసుకుంటానని చెప్పారు. దానికి కూడా థాంక్స్ చెప్పాను
భేటీలో ముఖ్యంగా చర్చించిన వాటిలో ఒకటి బాక్సైట్ తవ్వకాలు
అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని, బలవంతగా అమలు చేయొద్దని చెప్పాను
గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని, వాళ్లను అక్కడి నుంచి తరలించకూడదని కోరాను
చర్చలు జరిపి, అందరూ సరేనంటేనే తవ్వుతామన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు
రెండోది రాష్ట్రానికి ప్రత్యేక హోదా..
పార్లమెంటులో కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
పార్లమెంటులో చెప్పినదాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తామని ప్రధానమంత్రి కూడా అన్నారు
ఆయన ఏం చేస్తారో, కేంద్రం ఏం చేస్తుందో చూడాలని అనుకున్నాం
ఆ తర్వాత స్పందన తెలియజేద్దామని అనుకున్నా, అదే సీఎంకు చెప్పాను
మూడో విషయం.. మొత్తం అభివృద్ధి అంతా రాజధాని ప్రాంతంలోనే ఉంది, దాంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ఆందోళన ఉంది
నీటి పారుదలకు సంబంధించిన అంశాలు కూడా చర్చించాను
ఆయనతో మాట్లాడిన అంశాలన్నీ ఆశాజనకంగానే ఉన్నాయని అనిపించింది
ఏదైనా ఏకాభిప్రాయం లేకుండా, ఎవరినీ బలవంతపెట్టి చేయబోమని తెలిపారు.
భూసేకరణ విషయంలో నేను ఇంతకుముందు చెప్పినదానికే కట్టుబడి ఉన్నాను
ఎన్నికలకు సంబంధించి ఒక్క అంశం కూడా చర్చకు రాలేదు
బాక్సైట్ తవ్వకాల అంశం గతంలో వచ్చింది. అదిప్పుడు కొత్తగా సృష్టించినది కాదు
గిరిజనుల ఆరోగ్యం, ఇతర విషయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు
జీవో ఉన్నా.. వాళ్లను ఇబ్బంది పెట్టి, బలవంతం చేసేది ఉండదని అన్నారు
ఆంధ్ర ప్రజలకు ఇవ్వాల్సినవి ఇవ్వనప్పుడు కచ్చితంగా వాళ్లకు దెబ్బ తగులుతుంది
కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది
కచ్చితంగా కేంద్రం నిధులు ఇచ్చి తీరాలి
వాళ్లిచ్చిన మాట వెనక్కి తీసుకుంటే బీజేపీ నష్టపోయే అవకాశం ఉంటుంది