BBB minus
-
భారత్ విషయంలో ‘ఫిచ్’ కఠిన వైఖరి
న్యూఢిల్లీ: భారత్ విషయంలో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తన కఠిన విధానాన్నే కొనసాగించింది. వరుసగా 12వ ఏడాదీ పెట్టుబడులకు తక్కువ గ్రేడ్ అయిన ‘బీబీబీ మైనస్’ ను కొనసాగించింది. గతేడాది భారత సార్వభౌమ రేటింగ్‌ను మరో రేటింగ్ సంస్థ మూడిస్ పెంచగా, ఫిచ్ ఆ పనిచేయకపోవడంపై కేంద్ర సర్కారు విమర్శలు కూడా చేసింది. ఫిచ్ చివరిగా భారత రేటింగ్‌ను 2006 ఆగస్ట్ 1న బిబి+ నుంచి బీబీబీ–కు తగ్గించింది. అప్పటి నుంచి అదే రేటింగ్‌ను కొనసాగిస్తోంది. మధ్యలో 2012లో అవుట్‌లుక్‌ను ప్రతికూలంగా మార్చగా, ఆ మరుసటి సంవత్సరమే స్థిరానికి సవరించింది. భారత దీర్ఘకాలిక కరెన్సీ జారీ డిఫాల్టింగ్ రేటును ‘బీబీబీ– స్థిరం’గా కొనసాగిస్తున్నట్టు ఫిచ్ ప్రకటించింది. భారత రేటింగ్ కొనసాగింపు అన్నది మధ్యకాలిక బలమైన వృద్ధి అంచనాలు, సానుకూల ఎక్స్టర్నల్ బ్యాలన్స్లు, బలహీన ద్రవ్య పరిస్థితులు, సంస్థాగత అంశాల వెనుకబాటు ఆధారంగా నిర్ణయించినట్టు ఫిచ్ వివరించింది. వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందంటూనే... ద్రవ్య పరిస్థితులు బలహీనంగా ఉండటం క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావం చూపుతుందని, అది రేటింగ్‌కు అవరోధంగా తెలిపింది. ‘‘ప్రభుత్వ సాధారణ డెట్ 2017–18 జీడీపీలో 69 శాతానికి చేరింది. అదే సమయంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 0.3 శాతం మేర తప్పడం అన్నది జీడీపీలో ప్రభుత్వ సాధారణ లోటు 7.1 శాతానికి చేరినట్టు సూచిస్తోంది’’ అని ఫిచ్ వివరించింది. కారణాలు ఇవీ... ‘‘భారత ఆర్థిక రంగం ఇంకా చాలా అంశాల్లో పోటీ దేశాలతో పోలిస్తే తక్కువే అభివృద్ధి సాధించింది. ప్రపంచ బ్యాంకు గవర్నెన్స్ సూచీలో తక్కువ స్కోరే సాధించింది. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలోనూ తక్కువగానే ఉంది’’ అని ఫిచ్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.6 శాతానికి క్షీణించినప్పటికీ ... 2018–19లో 7.3 శాతానికి, 2019–20లో 7.5 శాతానికి వృద్ధి పెరుగుతుందని అంచనా వేసింది. మూడీస్ 14 ఏళ్ల తర్వాత భారత రేటింగ్‌ను గత ఏడాది బీఏఏ3 నుంచి బీఏఏ2కు మార్చగా, ఎస్అండ్పీ మాత్రం ఫిచ్ బాటాలోనే బీబీబీ– రేటింగ్‌ను కొనసాగిస్తోంది. -
ఇండియా రేటింగ్‌ను మార్చట్లేదు: ఫిచ్
♦ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగింపు ♦ 11 ఏళ్లుగా ఇదే దిగువస్థాయి పెట్టుబడుల రేటింగ్ ♦ 2017–18లో వృద్ధి 7.7 శాతం ముంబై: భారత్ సావరిన్ రేటింగ్‌లో ఎటువంటి మార్పు చేయడం లేదని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ స్పష్టం చేసింది. దీనితో ఈ రేటు స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగనుంది. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇది దిగువస్థాయి రేటింగ్. మరో మాటలో చెప్పాలంటే ‘జంక్’ (చెత్త) స్థాయికి ఇది ఒక మెట్టు ఎక్కువ. దాదాపు 11 సంవత్సరాల నుంచీ ఇదే రేటింగ్‌ను ఫిచ్ కొనసాగిస్తోంది. భారత్ సావరిన్ రేటింగ్‌ను 2006 ఆగస్టు 1వ తేదీన ఫిచ్ ‘బీబీప్లస్’ స్థాయి నుంచి ‘స్టేబుల్ అవుట్‌లుక్’తో ‘బీబీబీ మైనస్’కు పెంచింది. 2012లో ఒకసారి అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చినా, అటు తర్వాతి సంవత్సరంలో మళ్లీ‘స్టేబుల్’కు మార్చింది. ఇదే రేటును కొనసాగించడానికి ప్రధాన కారణాల్లో ‘పటిష్టంగాలేని పబ్లిక్ ఫైనాన్స్ వ్యవస్థ’ ఒకటని ఫిచ్ వివరించింది. 2016–17లో వృద్ధిరేటు 7.1 శాతంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2017–18లో 7.7 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నట్లు ఫిచ్ తాజా నివేదికలో పేర్కొంది. మరిన్ని వివరాలను పరిశీలిస్తే... స్వల్పకాలంలో పటిష్ట వృద్ధి ధోరణిని, సానుకూల విదేశీ ఆర్థిక అంశాల సమతుల్యతను తాజా రేటింగ్ సూచిస్తోంది. బలహీన ద్రవ్య పరిస్థితి, క్లిష్ట వ్యాపార వాతావరణ పరిస్థితులు వ్యవస్థలో కొనసాగుతున్నాయి. అయితే వ్యవస్థాగత సంస్కరణలు సరిగా అమలు చేస్తే– వ్యాపార పరిస్థితులు మెరుగుపడే వీలుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఎన్డీఏ ప్రభుత్వం తాను కోరుకుంటున్న సంస్కరణల ఎజెండాను తరచూ ప్రకటిస్తోంది. దీనిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. అయితే పెట్టుబడులు, వాస్తవ జీడీపీ వృద్ధిపై ఈ సంస్కరణల కార్యక్రమం ఏ మేరకు పడుతుందన్న అంశం... ఆయా కార్యక్రమాల అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది.