భారత్‌ విషయంలో ‘ఫిచ్‌’ కఠిన వైఖరి | The BBB rating is continuously maintained | Sakshi
Sakshi News home page

భారత్‌ విషయంలో ‘ఫిచ్‌’ కఠిన వైఖరి

Published Sat, Apr 28 2018 1:30 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

The BBB rating is continuously maintained - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ విషయంలో అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తన కఠిన విధానాన్నే కొనసాగించింది. వరుసగా 12వ ఏడాదీ పెట్టుబడులకు తక్కువ గ్రేడ్‌ అయిన ‘బీబీబీ మైనస్‌’ ను కొనసాగించింది. గతేడాది భారత సార్వభౌమ రేటింగ్‌ను మరో రేటింగ్‌ సంస్థ మూడిస్‌ పెంచగా, ఫిచ్‌ ఆ పనిచేయకపోవడంపై కేంద్ర సర్కారు విమర్శలు కూడా చేసింది. ఫిచ్‌ చివరిగా భారత రేటింగ్‌ను 2006 ఆగస్ట్‌ 1న బిబి+ నుంచి బీబీబీ–కు తగ్గించింది.

అప్పటి నుంచి అదే రేటింగ్‌ను కొనసాగిస్తోంది. మధ్యలో 2012లో అవుట్‌లుక్‌ను ప్రతికూలంగా మార్చగా, ఆ మరుసటి సంవత్సరమే స్థిరానికి సవరించింది. భారత దీర్ఘకాలిక కరెన్సీ జారీ డిఫాల్టింగ్‌ రేటును ‘బీబీబీ– స్థిరం’గా కొనసాగిస్తున్నట్టు ఫిచ్‌ ప్రకటించింది. భారత రేటింగ్‌ కొనసాగింపు అన్నది మధ్యకాలిక బలమైన వృద్ధి అంచనాలు, సానుకూల ఎక్స్‌టర్నల్‌ బ్యాలన్స్‌లు, బలహీన ద్రవ్య పరిస్థితులు, సంస్థాగత అంశాల వెనుకబాటు ఆధారంగా నిర్ణయించినట్టు ఫిచ్‌ వివరించింది.

వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందంటూనే... ద్రవ్య పరిస్థితులు బలహీనంగా ఉండటం క్రెడిట్‌ ప్రొఫైల్‌పై ప్రభావం చూపుతుందని, అది రేటింగ్‌కు అవరోధంగా తెలిపింది. ‘‘ప్రభుత్వ సాధారణ డెట్‌ 2017–18 జీడీపీలో 69 శాతానికి చేరింది. అదే సమయంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 0.3 శాతం మేర తప్పడం అన్నది జీడీపీలో ప్రభుత్వ సాధారణ లోటు 7.1 శాతానికి చేరినట్టు సూచిస్తోంది’’ అని ఫిచ్‌ వివరించింది.

కారణాలు ఇవీ...
‘‘భారత ఆర్థిక రంగం ఇంకా చాలా అంశాల్లో పోటీ దేశాలతో పోలిస్తే తక్కువే అభివృద్ధి సాధించింది. ప్రపంచ బ్యాంకు గవర్నెన్స్‌ సూచీలో తక్కువ స్కోరే సాధించింది. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలోనూ తక్కువగానే ఉంది’’ అని ఫిచ్‌ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.6 శాతానికి క్షీణించినప్పటికీ ... 2018–19లో 7.3 శాతానికి, 2019–20లో 7.5 శాతానికి వృద్ధి పెరుగుతుందని అంచనా వేసింది. మూడీస్‌ 14 ఏళ్ల తర్వాత భారత రేటింగ్‌ను గత ఏడాది బీఏఏ3 నుంచి బీఏఏ2కు మార్చగా, ఎస్‌అండ్‌పీ మాత్రం ఫిచ్‌ బాటాలోనే బీబీబీ– రేటింగ్‌ను కొనసాగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement