వరల్డ్ కప్ సెలక్షన్ రేసులో ఉండాలంటే..
కొలంబో: 2019 వన్డే వరల్డ్ కప్ సమయానికి ఆటగాళ్లు పూర్తి ఫిట్ నెస్ తో ఉంటేనే టీమిండియా సెలక్షన్ రేసులో ఉంటారని చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అప్పటికి భారత జట్టు అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టుగా రూపాంతరం చెందాల్సిన అవసరం కూడా ఉందన్నాడు. ఆ 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్ లో భారత జట్టు రాణించాలంటే ఫీల్డింగ్ పరంగా కూడా మెరుగవ్వాలన్నాడు.
'వన్డే ప్రపంచకప్ కు భారతజట్టును ఎంపిక చేసే సమయానికి ఎవరైతే ఫిట్ గా ఉంటారో వారికే అవకాశాలు ఉంటాయి. ప్రపంచకప్ కు ఇప్పట్నుంచే సన్నద్ధం కావాలి. కేవలం ఆటగాళ్లు తమ ఫిట్ నెస్ ను పొట్టి ఫార్మాట్ లోనే కాకుండా టెస్టు ఫార్మాట్ లో కూడా నిరూపించుకోవాల్సి ఉంది. అలా అయితేనే వన్డే జట్టు ఎంపికకు మార్గం సుగుమం అవుతుంది. నాలుగేళ్లకొకసారి వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ప్రదర్శన ఎలా చేయాలో ఆటగాళ్లకి తెలుసు. అదే సమయంలో ఫిట్ నెస్ , ఫీల్డింగ్ ల్లో మెరుగుదల సాధించాలి'అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.