bbc100 most influential women
-
‘అదృశ్యాల’పై అలుపెరగని పోరు..
న్యూఢిల్లీ : పర్వీనా అహంగర్.. జమ్మూ కశ్మీర్లో ఈ పేరు తెలియని వారుండరు.1990లో భారత సైన్యం తన కుమారుడిని అదృశ్యం చేసిందన్న ఆరోపణలపై 29 ఏళ్లుగా పోరాటం చేస్తూ 'ఐరన్ లేడీ ఆఫ్ కాశ్మీర్'గా ప్రసిద్ది చెందిన మహిళ ఆమె. అలుపెరగని పోరాటంతో బీబీసీ స్పూర్తిదాయక మహిళల జాబితా టాప్ 100 జాబితాలో ఈ ధీర వనిత చోటు సంపాదించారు. పర్వీనా అహంగర్ 1994లో అసోసియేషన్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ డిసప్పియర్డ్ పేరెంట్స్ (ఏపీడీపీ)ని ఏర్పాటు చేసి కశ్మీర్ లోయలో ‘అదృశ్యాల’పై గళమెత్తారు. 50 ఏళ్ల పర్వీనా 25 ఏళ్లుగా పోరాడుతూ ఏపీడీపీని ముందుండి నడిపిస్తున్నారు. ఆమె పోరాటానికి ఐక్యరాజ్యసమితి కూడా అండగా నిలిచింది. పర్వీనా ఉద్యమ స్ఫూర్తికి ఎన్నో పురస్కారాలు వరించాయి. 2015లో నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. మానవ హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికి గానూ పర్వీనాను 2017లో నార్వే దేశం ప్రఖ్యాత రాఫ్టో ప్రైజ్‌తో సత్కరించింది. తాను పోరాటానికి దారి తీసిన పరిస్థితుల గురించి గతంలో యూకే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో పర్వీనా అహంగర్ వివరించారు. 'నా కుమారుడు 11వ తరగతి చదివేటప్పుడు అదృశ్యమయ్యాడు. వాడు కనిపించకుండా పోయాడని తెలుసుకొన్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా కుమారుడిని జాగ్రత్తగా తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. తొమ్మిది రోజులు వారిచుట్టూ తిరిగినా ఏ సమాచారం అందించలేదు. ఇక లాభం లేదనుకొని పోరాటం మొదలు పెట్టాను. కనిపించకుండాపోయిన కొడుకు కోసం 27 సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్నట్లు' కన్నీటి పర్యంతమయ్యారు. 1991లో తన కొడుకు జాడను తెలపాలంటూ జమ్మూకశ్మీర్ హైకోర్టులో సైన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. తాను వేసిన కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇదే సమయంలోనే నా కుమారుడి ఆచూకీ కోసం పలుమార్లు ఆర్మీ శిబిరాలను సందర్శించాను. తన లాంటి పరిస్థితే అక్కడ చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్నాయని తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక ఆలోచన తట్టింది. నాలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న కుటుంబాలను కలిసి వారు మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నాను. మొత్తం 50 కుటుంబాలు నాకు మద్దతుగా నిలవడంతో 1994లో ఏపీడీపీని స్థాపించి దాని ద్వారా ఆర్మీకి వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ హైకోర్టులో సిట్ దాఖలు చేశాన’ని వివరించారు. అప్పటి నుంచి పర్వీనా ఆమె అనుచరులతో కలిసి చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పాలకులు ఎన్నిసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె వెనుకడుగు వేయలేదు. -
మిథాలీకి అరుదైన గౌరవం.. బీబీసీ జాబితాలో చోటు!
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం లభించింది. భారత్‌లో అత్యంత ప్రభావశీల మహిళగా మిథాలీని బీబీసీ గుర్తించింది. ఈ ఏడాది భారత్‌లోని ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ప్రపంచ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రికార్డు నమోదు చేసిన విషయం విదితమే. మిథాలీతో పాటు ఢిల్లీకి చెందిన రచయిత, యోగ టీచర్, సామాజిక కార్యకర్త ఇరా త్రివేది, జర్నలిస్ట్ తులికా కిరణ్, బెంగుళూర్‌కు చెందిన ఎంబైడ్ వ్యవస్ధాపక సీఈవో అదితి అవస్థి, నటుడు నవాజుద్దీన సిద్దిఖీ తల్లి మెహరున్నిసా సిద్ధిఖిలు ఈ జాబితాలో ఉన్నారు. ఆధునిక జీవితంలోని అన్ని రంగాల్లో వీరు తమదైన ముద్రతో దూసుకుపోతున్నారు. -
అలాంటి స్టేటస్ నాకు వద్దు: సన్నీలియోన్
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం కావడం సన్నీలియోన్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. 2011లో జరిగిన బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా ఆమె వెలుగులోకి వచ్చింది. 'జిస్మ్ 2' హాట్ సీన్లతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది సన్నీ. పోర్న్ స్టార్ ముద్రతో ఇక్కడికి వచ్చినా.. బాలీవుడ్ లో ఎన్నో మూవీలు చేసి త్వరలోనే తనదైన ముద్రవేసింది. అయితే తనకు మాత్రం సాధారణ మహిళగా ఉండటమే ఇష్టమని, సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా చూస్తే ఎంతో అసౌకర్యానికి లోనవుతానని సన్నీ చెప్పింది. ప్రస్తుతం బాద్ షా షారుక్ ఖాన్ తో రాయిస్ మూవీలో ఓ పాటలో ఆడి పాడానని, అక్షయ్ కుమార్ తోనూ నటించే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని అంటోంది. మూవీల కోసం తాను ఎంతో శ్రమించానని, అయినా సెలబ్రిటీ స్టేటస్ కావాలంటే ఏం చేయాలో తనకు అర్థంకాని విషయమని చెప్పింది. తన భర్త సహకారం లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదని అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని సన్నీలియోన్ అభిప్రాయపడింది. ఇటీవల బీబీసీ 100 మంది ప్రభావవంతమైన వ్యక్తులలో స్థానం దక్కించుకోవడంపై మాట్లాడుతూ.. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పింది. దాంతో పాటుగా గత అయిదేళ్ల నుంచి మోస్ట్ సెర్చ్డ్ పర్సన్ గా ఉండటంపై సన్నీ హర్షం వ్యక్తంచేసింది. తన మూవీలు కలెక్షన్ల వర్షం కురిపించినా, నిరాశపరిచినా తన శ్రమను గుర్తించినందకు అభిమానులకు హాట్ భామ సన్నీ ధన్యవాదాలు తెలిపింది.