తలవంపులు !
37 వేల కుటుంబాలకు శౌచాలయాలే లేవు
మురికివాడల్లో యలహంకదే మొదటి స్థానం
బీబీఎంపీ సర్వేలో వెల్లడైన వాస్తవాలు
బెంగళూరు: ఉద్యాన నగరి, ఐటీ నగరి ఇలా అనేక పేర్లతో సుపరిచితమైన బెంగళూరు నగరంలో రోజు రోజుకు అందుబాటులోకి వ స్తున్న అత్యాధునిక సౌకర్యాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ప్రపంచాన్నే ఆకర్షించే ఐటీ క్యాంపస్లు. ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు కనీసం సొంత శౌచాలయాలకు సైతం నోచుకోని వేలాది కుటుంబాలు మురికి వాడల్లో జీవితాన్ని గడుపుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) నగరంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
37 వేల కుటుంబాలకు ‘మరుగు’ లేదు...
బెంగళూరు నగరంలో లగ్జరీ భవంతులు, అపార్ట్మెంట్లే కాదు మురికివాడలకు సైతం కొదవ లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరంలో ఉపాధిని వెదుక్కుంటూ బెంగళూరుకు వచ్చిన లక్షలాది మంది మురికి వాడల్లోనే తమ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి మురికివాడల్లో కనీస మౌలిక సదుపాయాలు సైతం కనిపించడం లేదు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు ఇలా ఏ సదుపాయాన్ని తీసుకున్నా మురికివాడల్లో కనిపించదు. అంతేకాదు నగరంలోని మురికి వాడల్లో ఉన్న వేలాది కుటుంబాలకు కనీసం సొంత శౌచాలయాలు సైతం లేని పరిస్థితి ఉందంటే మురికివాడల్లోని ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఇక నగరంలోని మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజల్లో మొత్తం 37,183 కుటుంబాలకు సొంత శౌచాలయాలు లేవని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజల స్థితిగతులపై బీబీఎంపీ ఇటీవల ఈ సర్వే నిర్వహించింది. కాగా, బీబీఎంపీ నోటిఫై చేసిన మురికి వాడల్లో 17,435 కుటుంబాలు వ్యక్తిగత శౌచాలయాలకు దూరం కాగా, బీబీఎంపీ నోటిఫై చేయని మురికి వాడల్లో ఈ కుటుంబాల సంఖ్య 19,748గా ఉంది.
యలహంకలోనే అధికం...
కాగా నగరంలోనే అత్యధిక మంది యలహంక ప్రాంతంలోని మురికివాడల్లోనే వ్యక్తిగత శౌచాలయాలకు దూరంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. యలహంక ప్రాంతంలోని మురికివాడల్లో మొత్తం 14,498గా సర్వేలో తెలిసింది. ఇక బొమ్మనహళ్లి ప్రాంతంలోని మురికివాడల్లో అత్యంత తక్కువగా 229 కుటుంబాలు వ్యక్తిగత శౌచాలయాలకు దూరంగా ఉన్నాయి. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ నగరాల జాబితాలో బెంగళూరు నగరం 38వ స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగానే మురికివాడల్లోని ప్రజలకు వ్యక్తిగత శౌచాలయాలు నిర్మించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు బీబీఎంపీ అధికారి ఒకరు వెల్లడించారు.