ఆకట్టుకునే వ్యూహం
సాక్షి, విజయవాడ బ్యూరో :
ఆగస్టు 4న విజయవాడలో నిర్వహించే బీసీ ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ æస్వీకారానికి భారీ స్థాయిలో జనాన్ని సమీకరించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విడివిడిగా ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో చర్చలు జరిపారు. మొత్తం 11 బీసీ ఫెడరేషన్లు ఉండగా అందులో ఆరు ఫెడరేషన్లకు ఇటీవల చైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరందరినీ శనివారం క్యాంపు కార్యాలయానికి పిలిపించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ పాల్గొన్నారు. బీసీలంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, కాపులు కాస్త అటుఇటుగా ఉన్నట్లు చెప్పారు. కార్పొరేషన్ల ద్వారా కుల సమీకరణలు చేయవచ్చునని సూచించారు. మంత్రి కొల్లు మాట్లాడుతూ టీడీపీలో బీసీలు మొదటి నుంచీ బలమైన వర్గంగా ఉన్నారన్నారు. మిగిలిన ఫెడరేషన్లకు కూడా త్వరలోనే కమిటీలు వేస్తామని చెప్పారు. సీఎంను మెప్పించేందుకు బీసీ ఫెడరేషన్లు జన సమీకరణ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. పలు ఫెడరేషన్లలోని కొందరు మాట్లాడుతూ సొంతడబ్బులతో కుల సమీకరణ ద్వారా తీసుకురావడం సాధ్యం కాదని చెప్పడంతో విడివిడిగా మంత్రి మాట్లాడారు. ఫెడరేషన్లకు టీడీపీ అనుకూలురును చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించుకున్న విషయం తెలిసిందే. వారి ద్వారా తమకు బలం ఉందని సీఎం వద్ద నిరూపించుకోవచ్చుననే మంత్రి ఆలోచనకు సమావేశానికి వచ్చిన వారు అడ్డుకట్ట వేస్తున్నట్లు మాట్లాడటంతో మంత్రి కాస్త ఆలోచనలో పడ్డారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్థన్ కూడా పాల్గొన్నారు.