జాతీయ బీసీ కమిషన్‌కి రాజ్యాంగహోదా కల్పించాలి
న్యూఢిల్లీ: బీసీలకు న్యాయం జరిగేవిధంగా జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేలా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఒత్తిడి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ ఎంపీలంతా కృషి చేయాలని ఓబీసీ ఎంపీల పార్లమెంటరీ ఫోరం అభిప్రాయపడింది. అలంకారప్రాయంగా మారిన జాతీయ బీసీ కమిషన్‌కి ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాదిరిగా రాజ్యంగ హోదా కల్పించేందుకు ఓబీసీ ఎంపీలంతా పార్టీలకతీతంగా పోరాడాలని నిర్ణయించింది. ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించే అంశంపై చర్చించేందుకు ఓబీసీ ఎంపీల పార్లమెంటరీ ఫోరం కన్వీనర్, ఎంపీ వి హనుమంతరావు నేతృత్వంలో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో బుధవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు.
2 గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ఓబీసీ ఎంపీలు దత్తాత్రేయ, కె కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక, రాపోలు దేవేందర్‌గౌడ్ జేడీయూ అధ్యక్షుడు శరద్యాదవ్తోపాటు అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ ఎంపీలు హాజరయ్యారు. ఓబీసీలకు వచ్చిన రిజర్వేషన్ల అమలు పర్యవేక్షించే జాతీయ కమిషన్‌కి రాజ్యాంగ హోదా లేకపోవడంతో రిజర్వేషన్ల అమలుపై చర్యలు తీసుకోలేకపోతోందని, దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఓబీసీల్లో ఆర్థికంగా వెనుక బడి ఉన్న వారికి న్యాయం చేయాల్సి ఉందన్నారు.