బీసీల కొత్త కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న ‘సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్‌సీఎస్‌ఈబీసీ)’కు సివిల్ కోర్టులకు ఉన్న అధికారాలను కల్పించనుంది. ప్రస్తుతమున్న వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)ను రద్దు చేసి.. దాని స్థానంలో ఎన్సీఎస్ఈబీసీని ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధత కలిగిన ఎన్‌సీఎస్‌ఈబీసీ.. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. బీసీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.
ఇందుకు సంబంధించిన బిల్లుకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కొత్త కమిషన్‌లో చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తోపాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ ద్వారా ఓబీసీ కేంద్ర జాబితాలోకి చేర్చే సామాజిక వర్గాలను.. జాబితా నుంచి తొలగించే వీలు లేకుండా చట్టబద్ధత కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఓబీసీల్లోకి చేర్చాలంటూ జాట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.