బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది
అనంతపురం న్యూటౌన్ : సామాజికంగా బలంగా ఉన్న వర్గాన్ని బీసీ జాబితాలో చేరుస్తామంటూ ప్రభుత్వం అణగారిన బీసీలను దారుణంగా మోసం చేస్తోందని ఏపీ బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య అన్నారు. శనివారం స్థానిక సాయినగర్‌లోని బీసీ జనసభ కార్యాలయంలో ‘ప్రభుత్వంపై బీసీల పోరుబాట’ పోస్టర్లను విడుదల చేశారు. బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు సుధాకరయాదవ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నేతలు అన్నా రామచంద్రయ్య, యానాదయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అనంత నుంచే తమ పోరుబాటను ప్రారంభించామని,త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు.
కాపులను బీసీలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాపులతో సన్మానాలందుకోవడం అన్యాయమన్నారు. బీసీల అభిప్రాయాన్ని మన్నించకుండా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలకు బీసీలనే బాధ్యులు చేస్తూ నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంలో ప్రభుత్వ కుట్ర ఉందని విమర్శించారు. ఈనెల 17న మంజునాథ్ కమిషన్‌ను కలవడానికి స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి పెద్ద ఎత్తున బీసీ సంఘాల వారు లలితకళాపరిషత్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, అందరూ కలసిరావాలని వారు కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పవన్‌కుమార్, రజక లింగమయ్య, హరీష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.