మంత్రికి వినతుల వెల్లువ బీసీలకు రుణాలు ఇవ్వండి
కలెక్టరేట్ : వెనుకబడిన తరగుతుల వారిని మరింత వెనుకకునెట్టారని బీసీ యువజన,విద్యార్థి,మహిళా సంఘాల నాయకులు గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి,ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్‌రావులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థిసంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా వంచించిందన్నారు. 2013-2014 సంవత్సరంలో ఏ ఒక్క బీసీకి రుణం ఇవ్వకుండా జీవోలు,నిబంధనల పేరిట అడ్డుకుందన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు తలుచుకుంటే ఏమి జరుగుతుందో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం ద్వారా తెలిసిపోయిందన్నారు.
ఇక మీదట ఏ పార్టీలు, ప్రజాప్రతినిధులు బీసీలను తక్కువగా అంచనావేసినా కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సుమారు రెండు వేల మంది నెలల తరబడి బ్యాంకుల చుట్టు తిరిగి, బ్యాంకు రుణ అర్హత పత్రం, మంజూరు పత్రాలు పొందినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక మాసం చివరి నిమిషంలో నిబంధనల పేరిట బీసీలకు రుణాలు ఇవ్వకుండా అడ్డుకట్ట వేసిందన్నారు.
పెండింగ్‌లో ఉన్నా బీసీలకు రుణాలు అందించాలని,డిమాండ్ చేశారు. అలాగే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థిసంఘం నాయకులు యెండల ప్రదీప్,యువజన సంఘం నాయకులు మధు,మహిళా సంఘం నాయకులు పోదిల శొభ తదితరులు పాల్గొన్నారు.