బీసీలు ఏకం కావాలి
వినాయక్‌నగర్: రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలంతా ఒక్కటై ముందుకెళితే మనకు రాజకీయాల్లో ఎవరు టికెట్టు ఇవ్వనవసరం లేదని, మనమే టికెట్లు ఇద్దామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘మన రాష్ట్రంలో- మన రాజ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు ఇతరులు టికెట్లు ఇవ్వడమేంటి అని, మనమే ఇతరులకు టి కెట్లు ఇస్తామన్నారు.
బీసీలు ఇంటికొకరు రాజ్యాధికారం కోసం ఏకమైతే, 2019లో తెలంగాణలో బీసీలదే పాలన అన్నారు. సంక్షేమశాఖలన్నీ ముఖ్య మంత్రి కేసీఆర్ తన వద్ద పెట్టుకుని ఎస్సీ,బీసీ,ఎస్ట్టీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆంగ్లేయులను పారద్రోలి దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్న చరిత్రతో పాటు , సీమాంధ్ర పెత్తనాన్ని అణగదొక్కి తెలంగాణ సాధించుకున్న ఘనచరిత్ర మనకు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు తన దొరతనాన్ని చూపిస్తున్నారని విమర్శిం చారు. ఇప్పటి వరకు సంక్షేమ శాఖలకు మంత్రులకు కేటాయించకపోగా ఏ ఒక్కశాఖకు ఐఏఎస్ అధికారులను నియమించకపోవడం శోచనీయమన్నారు. అధికారికంగా ఢిల్లీటూర్ వెళ్లిన సీఎం ప్రధాని మోడీతో గానీ, కేంద్ర మంత్రులతో గానీ తెలంగాణరాష్ట్ర అభివృద్ధి పట్ల, నిధుల సేకరణపై ఒక్కమాట మాట్లాడకుండానే బంగారు తెలంగాణ నిర్మించుకుంటామని అనడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల పై నిర్లక్ష్యం
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో కుంటిసాకులు చెబుతూ, ఫాస్ట్ పథకం ద్వారా వెనుకబడిన వారి పిల్లలు చదువుకు దూరమవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. శిల్పి శిల్పాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో, బీసీలు కూడా 2019లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంతే కష్టపడాలని కోరారు. సదస్సులో మేదరులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను ఆయన తిలకించి ప్రశంసించారు. రోజు రోజుకు మేదరులు తయారు చేసిన వస్తువులకు ఆదరణ కరువవడం బాధాకరమన్నారు. మేదరుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో భాగంగా ‘వెనకబడిన తరగతుల వెనక ఉన్న కథ ఇది..’ అంటూ ఇందూర్ సిస్టర్స ప్రేరణి, ప్రణతి ఇంటర్ విద్యార్థులు పాడిన పాట సభికులను కట్టి పడేసింది. వెనకబడిన తరగతుల వారి స్థితిని తెలిపింది. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్, బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, రజక సంఘం ప్రతినిధి జెండా బాలాజీ చైర్మన్ నారాయణరావు(నాని), నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రాచమల్లు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.