బీసీసీఐ వ్యవహారంతో సంబంధం లేదు
హైదరాబాద్: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ అన్నారు. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించడం సరికాదని అభిప్రాయపడ్డారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఆలిండియా పోలీస్ ఎక్విస్ట్రెయిన్ చాంపియన్ షిప్, మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్‌ను ఆయన ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా క్రీడా సంఘాలను గాడిలో పెట్టేందుకు వాటి పనితీరుపై ఓ కమిటీ వేశామని మంత్రి తెలిపారు. ఆ కమిటీ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని చెప్పారు. నేషనల్ పోలీస్ అకాడమీకి చీఫ్ గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉందని అన్నారు. నిర్మించడం కంటే నిర్వహణ ముఖ్యమని మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పేవారని, మంచి నిర్వహణకు నేషనల్ పోలీస్ అకాడమీ ఉదాహరణగా నిలుస్తుందని ప్రశంసించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని చాలా మంది కలలు కంటారని, కొంతమంది మాత్రమే ఆ గమ్యాన్ని చేరుకుంటారని విజయ్ గోయల్ అన్నారు.