బీడీఎస్ ‘మేనేజ్మెంట్ కోటా’ఫీజు పెంపు
* ఫలించిన ప్రైవేటు కళాశాలల ఒత్తిళ్లు
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్, అన్ అయిడెడ్, నాన్ మైనారిటీ దంత వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజులను యథాతంగా కొనసాగించాలనే తన నిర్ణయాన్ని రెండు రోజులకే తెలంగాణ ప్రభుత్వం మార్చుకుంది. తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజులను పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నాన్ మైనారిటీ వైద్య విద్య కళాశాలల మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజులను పెంచుతూ ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, దంత వైద్య కళాశాలల ఫీజులు యథాతథంగా కొనసాగుతాయని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తితో నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం ..డెంటల్ కళాశాలల మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజును రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు, ఎన్ఆర్ఐ కోటా ఫీజులను రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది.