ఇంటి నుంచే సాధికారత మొదలవ్వాలి
‘బీ యువర్ ఓన్ హీరో’ సెమినార్లో దీపా వెంకట్
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటి నుంచి మహిళా సాధికారిత మొదలవ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణ భారత్ ట్రస్టు ఎండీ దీపా వెంకట్ ఆకాంక్షించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో భాగంగా శనివారం ‘బీ యువర్ ఓన్ హీరో’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆమె ప్రసంగించారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ, సహకారం వల్లే తాను స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు రాజకీయంగా, సామాజికంగా సమాన అవకాశాలు దక్కడం లేదన్నది వాస్తవమన్నారు.
రాజకీయ నాయక త్వం ఒక్కటే మహిళా సాధికారితకు చిహ్నం కాదని.. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగడం ద్వారా సాధికారికతని అన్నారు. కాగా, మహిళా సాధికారి త గురించి మాటలు చెప్పడం కాకుండా.. చెప్పే దానిని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితాలుంటాయని టీటీడీ పాలకమండలి సభ్యురాలు, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా చెప్పారు. మహిళలు ప్రతి విషయంలోనూ ఇంట్లో పెద్దవారి అభిప్రాయం తీసుకోవడం సరికాదని, సొంత నిర్ణయాలతో ఎదిగేందుకు ప్రయత్నించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్రావు కుమార్తె, వైద్యురాలు విజయలక్ష్మి సూచించారు.