గుడ్లు పెట్టబోతే గొడ్డలిపెట్టు
* సాగరతీరంలో పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులు
* తాబేళ్లకు ప్రాణాంతకమవుతున్న పునరుత్పత్తి తరుణం
పిఠాపురం: మనిషి మినహా ప్రతి జీవీ ప్రకృతి నిర్దేశాన్ని తు.చ. తప్పక పాటిస్తుంది. సముద్రపు తాబేళ్లదీ అలాంటి క్రమశిక్షణే. అయితే.. పాపం, అదే వాటి పాలిట మరణదండనగా మారుతోంది. ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ సముద్రపు తాబేళ్లకు జాతి పునరుత్పత్తి రుతువు. ఇప్పుడు వాటికి గుడ్లు పెట్టే కాలమే గొడ్డలిపెట్టుగా మారింది. ఏటా గుడ్లు పెట్టే తరుణంలో కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద సాగరతీరానికి వేలాది తాబేళ్లు వస్తుంటాయి. రాత్రి సమయాల్లో తీరానికి చేరుకుని గోతులు తవ్వి, గుడ్లు పెట్టి, పొదిగి, మళ్లీ ఆగోతులను ఇసుకతో పూడ్చి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి.
అనంతరం ఆ గుడ్లు పిల్లలుగా తయారయ్యి వాటంతటవే సముద్రంలోకి వెళుతుంటాయి. అయితే ఈ క్రమంలో తీరంలో పెట్టిన గుడ్లలో కొన్ని నక్కలు, కుక్కలు తినేస్తున్నాయి. గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చిన తాబేళ్లలో కొన్ని మత్స్యకారులు తీరం వెంబడి సాగించే అలివి వలలకు చిక్కి చనిపోతుండగా, మరికొన్ని ఇతర జంతువుల దాడిలో మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పుడు వాటికి మరింత దురవస్థ దాపురించింది. అసలు గుడ్లు పెట్టడానికి తీరంలో ఇసుక తిన్నెలే కరువయ్యాయి.
ఇక్కడ తీరంలో ఎక్కడ చూసినా సముద్ర కోతకు రక్షణగా వేసిన రాళ్లు మాత్రమే ఉన్నాయి. సంతానోత్పత్తి కోసం వచ్చిన తాబేళ్లు అలల తాకిడికి ఈ రాళ్లకు కొట్టుకుని మృత్యువాత పడుతున్నాయి. ఆ గండాన్ని గడిచి, ఉన్న కొద్దిపాటి ఇసుక తిన్నెల వద్దకు వస్తే ఇతర జంతువులు చంపేస్తున్నాయి. ఈ పరిణామంతో సముద్ర తాబేళ్ల సంతానోత్పత్తి పూర్తిగా దెబ్బతిని భవిష్యత్తులో వాటి సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, అది పర్యావరణంపై దుష్ర్పభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ముప్పును గుర్తించి, మత్స్యకారుల్లో అవగాహన కల్పించడంతో పాటు తీరంలో తాబేళ్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.