నేను బీఫ్ తింటా, ఎవరైనా ఆపగలరా?
న్యూఢిల్లీ : ఎన్డీయే సర్కార్‌లో సహచర మంత్రుల మధ్య బీఫ్ వ్యవహారం ముదురుతోంది. బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్తాన్ వలస వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు.
'నేను గొడ్డు మాంసం తింటాను. అరుణాచల్ ప్రదేశ్‌లోనే ఉంటా. నాతో ఎవరైనా బీఫ్ తినడం మాన్పించగలరా? అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. భారత్ దేశంలో అందరి మనోభావాలు గుర్తించాలని, వారి వారి పద్ధతులు, సంప్రదాయాలను సమానంగా గౌరవించాల్సి ఉందన్నారు. బీఫ్ తినవద్దని చెప్పడానికి ఆయన ఎవరూ అంటూ నక్వీపై కిరణ్ రిజిజు మండిపడ్డారు.
ఒకవేళ బీఫ్ తినకుండా నిషేధించాలనుకుంటే.. మహారాష్ట్రలో హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉన్నందున హిందు మతవిశ్వాసం ప్రకారం అక్కడని చట్టాన్ని అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక శాతం ప్రజలు బీఫ్ తింటారని, దానివల్ల తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. ప్రతి పౌరుడి మనోభావాలను గుర్తించాలని కిరణ్ రిజిజు అన్నారు.
బీఫ్ తినాలనుకుంటే పాక్,లేదా అరబ్ దేశాలు వెళ్లాలని నక్వీ వ్యాఖ్యలు చేయటం మంచి పరిణామం కాదన్నారు. అయితే ఆయనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ...ప్రజల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. కాగా గోమాంసం తినకపోతే చచ్చిపోతారనకుంటే.. పాకిస్తాన్, లేదా అరబ్ దేశాలకు వెళ్లాలని నక్వీ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. గోవధను నిషేధించడం మీద కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇక గోవధను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడైనా ఆవు మాంసాన్ని విక్రయించిన లేదా కలిగి ఉన్నా వాళ్లకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50 వేల రూపాయల జరిమానా విధించనున్నారు.