అమెరికా అధ్యక్షుడికోసం.. క్యాడిల్లాక్ బీస్ట్ 2.0
ఆమెరికా అధ్యక్షుడికోసం అప్పుడే ప్రత్యేక వాహనం సిద్ధమైపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష పదవికి ఎన్నికవుతారో ఇంకా తెలియక ముందే... క్యాడిల్లాక్ కు చెందిన బీస్ట్ కారును కొత్త అమెరికా అధ్యక్షుడికోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైన కారుకు రహదారి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ యుద్ధానంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1919 లో విక్టోరియా పరేడ్ లో క్యాడిల్లాక్ లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగనున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే వారికోసం ఈ క్యాడిల్లాక్ బీస్ట్ కారు సేవలందించేందుకు ముందుకొస్తోంది. ఈ క్యాడిల్లాక్ కారు సేవలు మొదలైన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఎవురు శక్తివంతమైన కారును వినియోగిస్తున్నారో స్పష్టం కానుంది. లిమోసిస్ క్యాడిల్లాక్ బీస్ట్ కారు... డిజైన్ పరంగా చూస్తే... ముందు భాగం ఎస్కలేడ్ ఎస్యూవీ లా కనిపిస్తుండగా.. వెనుక మాత్రం డిస్ కంటిన్యూడ్ క్యాడిల్లాక్ డీటీఎస్ రూపంలో ఉంటుంది.
సాయుధ లక్షణాలు కలిగి ఉండేందుకు వీలుగా ఈ లిమోసిస్ ను భారీ ట్రక్ ఛాసిస్ మీద నిర్మించారు. దీనికి తోడు బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబ్ ప్రూఫ్ లక్షణాలు కలిగి ఉండేట్లుగా లిమోసిస్ 2.0 ని నూతన అధ్యక్షుడికోసం ప్రత్యేకంగా అభివృద్ధి పరుస్తున్నారు. ఎన్నో సరికొత్త భద్రతా ఫీచర్లతో తయారవుతున్న లిమోసిస్ కు చెందిన పూర్తి వివరాలను భద్రత దృష్ట్యా వెల్లడించలేదు. ఇప్పటికే చివరిదశలో పరీక్షలు నిర్వహిస్తున్న క్యాడిల్లాక్ బీస్ట్ 2.0 ని జనవరి 2017 నాటికి పూర్తిశాతం అభివృద్ధి చేసి అందుబాటులోకి తేనున్నారు.