‘బీట్’ లేనట్లే!
గజ్వేల్, న్యూస్‌లైన్: మూడు జిల్లాల రైతులకు గజ్వేల్ మార్కెట్ యార్డే ప్రధాన ఆధారం. వారు పండించిన పంటలన్నీ ఈ యార్డుకే తరలించి విక్రయించుకుంటారు. కానీ యార్డు లో ‘బీట్’ విధానం అమల్లోకి తేవడంలో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారుల మధ్య పోటీతత్వం కరువై వారు చెప్పిన ధరకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. మరోపక్క ట్రే డ్ లెసైన్స్‌లు లేని దళారులు కల్లాల వద్దే కాంటాలు నిర్వహిస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవ హరిస్తున్నారు. అంతిమంగా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.
అధికారుల అలసత్వం..దళారులకు వరం
జిల్లాలోని వివిధ ప్రాంతాలకే కాకుండా వరంగల్, నల్గొండ జిల్లాల రైతులకు ప్రధాన మార్కెట్ గజ్వేల్ యార్డు. అందువల్లే ఇక్కడ వ్యాపారుల మాయాజాలానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు రెండేళ్లక్రితం నుంచి ‘బీట్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొనుగోలుదారుల మధ్య పోటీతత్వం పెంచితే రైతులకు గిట్టుబాటు ధర అందించవచ్చనే భావనతో ఈ విధా నం తెచ్చారు. ఈసారి సీజన్ పూర్తి కావస్తున్నా.... అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కించడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘బీట్’ లేక పోవడంవల్ల వ్యాపారులు నిర్ణయించిన ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకొని వెళ్తున్నారు. అంతేకాకుండా పత్తికి వంద కిలోల సంచిపై తరుగు పేరిట ఇష్టానుసారంగా కోత పెడుతుండగా నియంత్రించే వారు కరువయ్యారు.
కల్లాల వద్ద కాంటాలతో మోసాలు
గ్రామాల్లో ట్రేడింగ్ లెసైన్స్‌లేని దళారుల మోసాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కల్లాల వద్ద కాంటాలను నిర్వహిస్తున్న దళారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లను జరుపుతున్నా మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేక పోవడంవల్ల వారు మరింత చెలరేగిపోతున్నారు. కొందరైతే తూకపు బాట్ల స్థానంలో బండరాళ్లను ఉంచి నిలువునా దోచుకుంటున్నారు.