బంద్ విజయవంతం
ముందస్తు సెలవు ప్రకటించిన ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలు
పరిమిత సంఖ్యలో సంచరించిన బీఎంటీసీ, ఆర్టీసీ బస్సులు
బోసిపోయిన విధానసౌధ
చిన్నపాటి ఘటనలు మినహా బంద్ ప్రశాంతం
భారీగా మొహరించిన బలగాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా సుమారు 50 కన్నడ సంఘాలు ఇచ్చిన ‘12 గంటల బెంగళూరు బంద్’కు మిశ్రమ స్పందన లభించింది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించిన ఈ బంద్‌కు స్వచ్ఛంద మద్దతు లభించింది. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. వ్యాపారులు, హోటళ్ల యజమానులు బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఆటో, టాక్సీ సంఘాల్లోని ఓ వర్గం బంద్‌కు మద్దతునిచ్చాయి.
బీఎంటీసీ, ఆర్టీసీ బస్సులు పరిమిత సంఖ్యలోనే తిరిగినా, ప్రయాణికుల రద్దీ చాలా తక్కువగా కనిపించింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేసినా ఉద్యోగులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. సందర్శకులు, ఉద్యోగులు పెద్దగా రాకపోవడంతో సచివాలయం విధాన సౌధ బోసిపోయింది. ఐటీ, బీటీ కంపెనీలు సహా అనేక ప్రైవేట్ కార్యాలయాలు సెలవు ప్రకటించాయి. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాలు, కూడళ్లు బోసిపోయి కనిపించాయి.
చందాపుర, టానరీ రోడ్డుల్లో రెండు బీఎంటీసీ బస్సులపై ఎవరో ఆకతాయిలు రాళ్లు రువ్వడం మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులకు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. ఆందోళన చేపట్టిన వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బంద్‌లో పాల్గొనడం లేదని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ప్రకటించినప్పటికీ, ఒకటి, రెండు మినహా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అనేక థియేటర్లలో మార్నింగ్ షో, మ్యాట్నీలను రద్దు చేశారు. ఆరు గంటల తర్వాత కొన్ని థియేటర్లలో ఫస్ట్ షో ప్రారంభమైనప్పటికీ, పది శాతం మంది కూడా ప్రేక్షకులు రాలేదు.
జన జీవనంపై బంద్ ప్రభావం
నిత్యం రద్దీగా ఉండే హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు, ఎంఎస్ బిల్డింగ్, విశ్వేశ్వరయ్య టవర్స్ తదితర చోట్ల తక్కువ సంఖ్యలో జనం కనిపించారు. బంద్ గురించి ముందు నుంచే ృస్తత ప్రచారం చేయడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు సుమారు 40 శాతం, బీఎంటీసీ సుమారు 25 శాతం సంచరించ లేదు. ఫ్రేజర్ టౌన్లో ఓ యువతిపై, విబ్‌గ్యార్ స్కూలులో ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారాలు జరిగినప్పటి నుంచి నగర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోడంతో బంద్‌కు ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభించింది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల పంపిణీ తదితర అత్యవసర సేవలను బంద్ నుంచి మినహాయించారు.