పరిశ్రమల హబ్ గా ‘పట్నం’
⇔ దేశం చూపంతా జిల్లా వైపే
⇔ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
⇔ ఫార్మాసిటీ బాధితులకు పరిహారం పంపిణీ
⇔ డబ్బు వృథా చేసుకోవద్దు : ఎమ్మెల్యే మంచిరెడ్డి
యాచారం : దేశం గర్వించ తగిన పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిశ్రమల హబ్‌గా మారనుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ భూ బాధితులకు శనివారం కుర్మిద్ద గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సర్పంచ్ విజయనాయక్‌తో కలిసి పరిహార చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే టీసీఎస్‌తో పాటు పలు పరిశ్రమల ఏర్పాటయ్యాయని, తాజాగా ఫార్మాసిటీతో నియోజకవర్గం జిల్లాలకే తలమానికం కానుందన్నారు.
ప్రతి పల్లెకూ ఆర్టీసీ బస్సు, బీటీ రోడ్డే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మిషన్ భగీరథ కింద వచ్చే నెలలో మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన పేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికీ 1000 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రూ. 368 కోట్ల నిధులతో రెండో విడత మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలను మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు.
డబ్బులను వృథా చేసుకోవద్దు.. ఎమ్మెల్యే
ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని వృథా చేసుకోవద్దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మహేందర్‌రెడ్డి చూపుతున్న అభిమానం మరువలేనిదని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే, మంత్రితో కలిసి నస్దిక్‌సింగారం, కుర్మిద్ద గ్రామాల్లో రెండు చెరువుల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు.
రూ. కోటిన్నర నిధులతో కుర్మిద్ద- కుర్మిద్ద తండా వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ. 50 లక్షలకు పైగా నిధులతో నంది వనపర్తి - యాచారం బీటీ రోడ్డును ప్రారంభించారు. నస్దిక్‌సింగారంలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించారు. గాండ్లగూడెంలో నూతనంగా నిర్మించిన మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్విహ ంచారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ రామకృష్ణ, ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు నేనవత్ విజయనాయక్, అచ్చెన మల్లికార్జున్, మారోజ్ కళమ్మ, వన్నెవాడ అరుణమ్మ, రాజునాయక్, సత్య పాల్, ఎంపీటీసీ సభ్యులు గుర్రాల భాగ్యమ్మ, గడల మాధవి, టీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి, సత్తు వెంకటరమణరెడ్డి, ముత్యాల మధుసూదన్‌రెడ్డి, కిషన్‌నాయక్, పాండురంగారెడ్డి తది తరులు పాల్గొన్నారు.