గత రెండేళ్లలోనే 279 మంది డోపీలు
న్యూఢిల్లీ: గత రెండేళ్లలోనే దేశంలో 279 మంది క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారని కేంద్ర క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్‌గా తేలిన వారిలో ఎక్కువగా పవర్‌లిఫ్టర్లు, వెయిట్‌లిఫ్టర్లు ఉన్నారని ఆయన చెప్పారు. డోపింగ్ రహిత క్రీడల కోసం భారత ప్రభుత్వం, నాడా కృషి చేస్తున్నాయని ఆయన వివరించారు. ఆటల్లో ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పేందుకు, మచ్చలేని అథ్లెట్లను తయారు చేసేందుకు నాడాతో కలిసి సంయుక్తంగా పనిచేస్తున్నామని జితేంద్ర తెలిపారు. ‘గడిచిన మూడేళ్లలో నాడా 9898 మందికి డోప్ టెస్టులు నిర్వహించింది. డ్రగ్స్ నిరోధానికి ప్రత్యేక వర్క్‌షాప్‌లు పెట్టి యువ ఆటగాళ్లకు, కోచ్‌లకు అవగాహన కల్పిస్తోంది. స్కూల్ గేమ్స్ పోటీల సందర్భంగా భావి క్రీడాకారుల కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది’ అని ఆయన వివరించారు.
కేరళలో జాతీయ క్రీడలు
35వ జాతీయ క్రీడలు వచ్చే ఏడాది మార్చిలో కేరళలో జరుగుతాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈపోటీల నిర్వహణ కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రూ.110 కోట్లను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 35 క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని సోమవారం ఆయన లోకసభలో తెలిపారు.