తిరిగొచ్చిన మగతనంతో తండ్రి కాబోతున్నాడు
కేప్‌టౌన్: అవును. కోల్పోయిన మగతనాన్ని ఆపరేషన్ ద్వారా తిరిగి పొందిన 22 ఏళ్ల దక్షిణాఫ్రికా యువకుడు తండ్రి కాబోతున్నాడు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పురుషాంగం (పెన్నిస్) ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ నిర్వహించిన కేప్‌టౌన్‌లోని టైగర్బర్గ్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఆపరేషన్ ద్వారా మగతనాన్ని పొందిన ఆ యువకుడు (పేరు వెల్లడించలేదు) తండ్రి కాబోతునట్లు చెప్పాడు. ప్రస్తుతం అతని గర్లప్రెండ్ నాలుగు నెలల గర్భవతి. ఈ వార్త మమ్మల్ని ఆనందింపజేస్తోంది' అని పేర్కొన్నారు.
మత మార్పిడిలో భాగంగా సున్తీ చేయించుకున్న సదరు యువకుడు కొద్ది రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సున్తీ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని పురుషాంగాన్ని తొలిగించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత కొద్ది నెలల కిందటే కేప్‌టౌన్ వైద్యులు..యూనివర్సిటీ ఆఫ్ స్టెల్లెన్బోస్చ్ ప్రొఫెసర్ల సహకారంతో ఆ యువకుడికి మగతనాన్ని ప్రసాదించారు. అనారోగ్యంతో మరణానికి చేరువైన ఓ వ్యక్తి అవయవ దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అతని అంగాన్ని సదరు యువకుడికి అమర్చారు.