భిక్షాటనలో బాల్యం
పట్టించుకోని పాలకులు
గూడూరు టౌన్ : బాల్యం భిక్షాటన చేస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో బాల్యం ప్రశ్నార్థకంగా మారింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల పలువురు బాలలు యాచకులుగా మారుతున్నారు. ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమాలతో బడీఈడు పిల్లలను బడికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. భిక్షాటన చేస్తున్న బాలల కోసం అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఎందుకూ పనికి రావడం లేదు.
భిక్షాటనే వృత్తిగా.. : జిల్లాలో 2 వేలకు పైగా చిన్నారులు భిక్షాటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమాహాళ్లు, కళాశాలలు, షాపింగ్‌మాల్స్, కూడలి ప్రాంతాలు, ఆలయాల వద్ద అనేక మంది చిన్నారులు యాచిస్తున్నారు. బడిఈడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలకు పంపేలా ఐసీపీఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖాధికారులతో పాటు ప్రభుత్వంలోని అన్నిశాఖల అధికారులు పని చేయాల్సి ఉంది. భిక్షాటన చేస్తు న్న వారిలో ఎక్కువగా 14 ఏళ్లలోపు చిన్నారులే ఉంటున్నారు. నెల్లూరులోని సుందరయ్య కాలనీ, గూడూరు, కావలి రైల్వేస్టేషన్ల సమీపంలో నివాసముంటున్న వారి పిల్లలే అధికంగా భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది అయ్యప్పమాల సీజన్లో స్వామి మాలలు ధరించి భిక్షాటన చేస్తున్నారు.
తూతూ మంత్రంగా పథకాలు అమలు..
నిర్బంధ విద్య, బడి పిలుస్తోంది తదితర పథకాలు తూతూ మంత్రంగా అమలవుతుండడంతో చిన్నారుల జీవితాలు భిక్షాటనతో బుగ్గిపాలవుతున్నాయి. భిక్షాటన చేస్తున్న బాలలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా వారు మారడం లేదని ఐసీపీఎస్ అధికారులు అంటున్నారు. అందుకే పోలీసుల సాయంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో బాలికల కోసం ఐదు పునరావాస కేంద్రాలున్నాయన్నాయన్నారు. బాలురకు పునరావాస కేంద్రాలు లేవు. వారిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న కేంద్రాలకు పంపుతున్నట్లు వారు తెలిపారు.