క్రీ‘డల్’ !
ప్రభుత్వ పాఠశాలలో ఆటలకు స్థలం కరువు
ప్రయివేటు స్కూళ్లకు మైదానాల కొరత
బాన్సువాడ:
ర్యాంకుల వేటలో బాల్యం బలైపోతోంది. క్రీడలకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నానని చెబుతున్నా క్రీడలు మాత్రం చతకిలబడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లకు నిధుల కొరత వేధిస్తుంటే, ప్రైవేటు స్కూళ్లకు మైదానాలు కరువయ్యాయి. ‘ఆగస్టు చివరి వారంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాలి’.. ఇది 2016–17 విద్యా సంవత్సరం క్యాలెండర్లో పేర్కొన్న ప్రణాళిక. కానీ ఒకటి, రెండు తప్ప మిగతా మండలాల్లో ఎక్కడా పోటీలు ప్రారంభం కాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రీడా పోటీలకు ఇస్తున్న ప్రాధాన్యమేమిటో, అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం క్రీడలకు సమయం తగ్గించాలని నిర్ణయించడంపై అసంతృప్తి్త వ్యక్తమవుతోంది. జిల్లాలో 417 ఉన్నత పాఠశాలలు, 618 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,747 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొందరు క్రీడల్లో రాణిస్తున్నా తగిన ప్రోత్సాహం లభించట్లేదు. ప్రస్తుతం జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయల కొరత తీవ్రంగా ఉంది.
క్రీడలకు సమయం కరువు
విద్యార్థులకు క్రీడల కోసం కేటాయించే సమయం తగ్గిపోతోంది. చాలా ప్రైవేటు స్కూళ్లలో అసలు క్రీడల మాటే లేదు. ప్రభుత్వ బడుల్లో నిత్యం ఖోఖో, వాటీబాల్, కబడ్డీ, క్రీకెట్, బాల్‌బ్యాడ్మింటన్, త్రోబాల్‌తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, హైజంప్ నేర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కదానిలో విద్యార్థులు రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఉన్నత పాఠశాలల్లో ఒక్కో తరగతికి వారానికి కేవలం మూడు పీరియడ్లు మాత్రమే క్రీడలకు కేటాయిస్తున్నారు. అయితే, టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశ్యంతో వారికి క్రీడలకు సమయమే ఇవ్వట్లేదు.
క్రీడా పరికరాల కొరత..
జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో క్రీడా పరికరాల జాడే లేదు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడంతో తాత్కాలిక బోధకుల్ని నియమించకున్నారు. కొందరు ఉత్సాహంగా విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా క్రీడా పరికరాల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లుగా పాఠశాలల్లో క్రీడల అభివృద్ధి, పరికరాల కొనుగోలుకు ఏటా రూ.15వేల నిధులను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఆ నిధులకు సైతం మంగళం పాడేశారు. దీంతో క్రీడా పరికరాలు అందుబాటులో లేకుండా పోయాయి.
ప్రైవేటు బడుల్లో మరీ ఘోరం..
నిబంధనల ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు తప్పనిసరిగా క్రీడా మైదానాలు ఉండాలి. కానీ ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ బడులకు మైదానాలే లేవు. చిన్న ఇండోర్ స్టేడియం ఉన్నా పాఠశాలలకు అనుమతి ఇవ్వొచ్చని ప్రభుత్వం నిబంధనలు మార్చడం ప్రైవేటు స్కూళ్లకు కలిసొచ్చింది. అయితే, చాలా పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాలు కూడా లేవు. ఇవన్నీ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.
‘ధ్యాన్‌చంద్’ పేరిట క్రీడా దినోత్సవం
ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జన్మించిన రోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఆయన.. హాకీలో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒలింపిక్స్‌లో వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్స్‌ను సాధించి పెట్టాడు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది.