చిన్నారుల పుస్తకాల్లో అవి చూసి పేరెంట్స్ షాక్!
బీజింగ్: సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో చైనా చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటుంది. విద్యార్థులకు లైంగిక విద్య పట్ల కనీస అవగాహన కల్పించడం లేదని చైనాపై విమర్శలున్నాయి. పాఠశాల సిలబస్ తదితర విద్యాకార్యక్రమాల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని చాలా కాలంగా అక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ.. సెక్స్ ఎడ్యుకేషన్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను ఇటీవల రూపొందించింది. అయితే.. అందులో వాడిన గ్రాఫిక్స్ వివాదాస్పదం అయ్యాయి.
బీజింగ్‌లోని 18 ఎలిమెంటరీ పాఠశాలల్లో 6 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ బోధించడానికి ఈ పుస్తకాలను వాడుతున్నారు. అయితే.. బుక్స్ పరిశీలించిన తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాల్లోని గ్రాఫిక్స్ తమ పిల్లలను చెడగొట్టేలా ఉన్నాయని వారు వాపోతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమే గానీ.. అది విద్యార్థులకు అందించే విధానం మాత్రం ఇది కాదంటూ విమర్శిస్తున్నారు. పుస్తకాల్లోని విషయాలు చూడటానికే సిగ్గేస్తుందని ఓ విద్యార్థి తల్లి సోషల్ మీడియాలో వాపోయింది.
కాగా.. అభ్యంతరాలపై స్పందించిన బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ.. పాఠ్యపుస్తకాలను పలు దశలు పరిశీలించి.. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించాకే రూపొందించామని చెబుతోంది. గతంలో యూనివర్సిటీ విద్యకు వెళ్లేంతవరకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండేది కాదని.. ఇది ఆహ్వనించదగిన పరిణామం అని సోషల్ మీడియాలో కొందరు సపోర్ట్ చేస్తున్నారు.