‘మందడం’లో భూమిపూజకు నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణానికి తుళ్లూరు మండలం మందడం గ్రామ శివార్లలో ప్రభుత్వం వచ్చే నెల 6వ తేదీన భూమిపూజ చేయనుంది. దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడకపోయినా అక్కడి స్థలంలోనే భూమిపూజ చేయాలని మంత్రులు, సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటివరకు తర్జనభర్జనలు పడినా చివరికి మందడం ప్రదేశాన్ని ఎంపిక చేశారు. మందడం, తాళ్లాయిపాలెం మధ్య ఉన్న 25 ఎకరాల స్థలంలో ఎలాంటి పంటలు లేక ఖాళీగా ఉంది. ఇదంతా తుళ్లూరు జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, ఆయన బంధువులకు చెందిన భూమి.
అక్కడే భూమి పూజ చేయాలని మంత్రులు మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతోపాటు మరో రెండు ప్రదేశాలు చూసినా అవి కరకట్ట లోపల ఉండటంతో సీఆర్డీఏ అధికారులు వాటివైపు మొగ్గు చూపలేదు. భూమిపూజ చేసే ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా మాస్టర్‌ప్లాన్ ఉండేలా చూడాలని సీఆర్డీఏ అధికారులు సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ 25 ఎకరాలకు ఆనుకుని ఉన్న 50 ఎకరాలను స్వాధీనం చేసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.