బెల్గావ్లో శివసేన ఆందోళన
సాక్షి, ముంబై: మహారాష్ర్ట, కర్ణాటక సరిహద్దులోని ‘యెళ్లూర్’ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన శివసేన నాయకుడు దివాకర్ రావుతేను శుక్రవారం కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో ఉన్న శిణోలి గ్రామంలో కర్ణాటక ప్రభుత్వ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అంతేగాక కర్ణాటక ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ కొల్హాపూర్లో బంద్ పాటించారు. యెళ్లూర్ గ్రామ పొలిమేరలో కొందరు ఇది మహారాష్ట్ర సరిహద్దులోకి వస్తుందని బోర్డు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు గత అదివారం ఆ గ్రామ ప్రజలపై పోలీసులు దాడిచేసి దొరికినవారిని దొరికినట్లే చితక బాదారు. ఇళ్లలో ఉన్న మహిళలు, గర్భిణిలు అని చూడకుండా బయటకు ఈడ్చుకొచ్చి కొట్టారు. ఈ ఘటనలో అనేక మంది అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం రావుతే అక్కడికి వెళ్లారు. సరిహద్దులోని బెల్గావ్లో పంచముఖి హోటల్ వద్ద ఆయన్ని కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. యెళ్లూర్ వెళ్లేందుకు అనుమతించలేదు. తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో రావుత్ అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు యత్నించారు.
కాని వాగ్వాదం జరగడంతో పోలీసులు వెంటనే రావుత్పాటు ఎమ్మెల్యే సుజీత్ మించేకర్, కొల్హాపుర్ జిల్లా ప్రముఖుడు విజయ్ దేవణే తదితరులను బలవంతంగా తీసుకువచ్చిమహారాష్ట్ర హద్దులోని శిణోలి గ్రామంలో వదిలేశారు. బెల్గావ్ సరిహద్దులోని గ్రామాల్లో కర్ణాటక పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆగ్రహానికి గురైన శివసేన కార్యకర్తలు కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం కొల్హాపూర్ జిల్లా కేంద్రం వరకు పాకింది. స్థానిక ఎమ్మెల్యే రాజేశ్ క్షిర్సాగర్ నేతృత్వంలో సర్కారు శవయాత్ర నిర్వహించారు. పట్టణంలో ఊరేగింపు నిర్వహించి షాపులను, వ్యాపార సంస్థలను మూసివేయించారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ప్రస్తుతం శాంతి, భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.