రాందేవ్‌పై పతంజలి మాజీ సీఈవో ఫైర్
యోగా గురు బాబా రాందేవ్‌పై పతంజలి సంస్థ మాజీ సీఈవో ఎస్‌కేపాత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 10,561 కోట్ల టర్నోవర్‌తో ఎఫ్‌ఎంసీజీరంగంలో దిగ్జజ కంపెనీలకు దడపుట్టిస్తూ దూసుకుపోతున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదనీ, పైగా దీన్ని సేవగా భావించాలని కోరుతోందని ఆయన ఆరోపించారు. సంస్థలోని ఉద్యోగులకు కంపెనీ చాలా తక్కువ మొత్తంలో చెల్లిస్తోందని తెలిపారు. బాబాజీ (బాబా రాందేవ్) దీనిని సేవగా పిలుస్తున్నారని వివరించారు. ముఖ్యంగా తాను కంపెనీ ఉచితంగా సేవ చేయాలని భావించారన్నారు. అలాగే బాబా రాందేవ్ చెప్పే మాటలకీ, ఆచరణకీ అస్సలు పొంతన వుండదని అభిప్రాయపడ్డారు. అందుకే తాను కంపెనీని వీడినట్టు చెప్పారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు
తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్‌పార్క్‌లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. రెండు ఉద్యోగాలకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, ఉల్లంఘించారని ఆరోపించారు. ముందు హామీ ఇచ్చినట్టు కాకుండా ఒక ఉద్యోగానికే వేతనం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మొత్తం కంపెనీలకు ఉచితంగా సేవలు అందించాలని తనను కోరారన్నారు. పతంజలి సేవ కోసమే పుట్టిందని, ప్రస్తుతం ఆయన వేతనం తీసుకుంటున్నా, తర్వాత అది ఉండదని తనను ఉద్దేశించి పతంజలి ప్రకటించినట్టు తెలిపారు. ఇదే అంశంపై తాను పలుమార్లు బాబా రాందేవ్‌ను సంప్రదించినా ఫలితంలేదన్నారు. తన కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వేతని చెల్లించమని వేడుకున్నట్టు చెప్పారు.
ఉద్యోగులకు, సరైన శిక్షణ లేకుండా, ఎలాంటి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న సంస్థను తాను అభివృద్ధి చేశానన్నారు. కంపెనీ అమ్మకాలను రూ. 317 కోట్ల నుంచి రూ .2,500 కోట్లకు పెరిగిగాయని తెలిపారు.
అలాగే బాబా రాందేవ్ చాలా షార్ప్.. తనకు తెలియని విషయాలను చాలా ఆసక్తిగా వింటారు..చాలా తొందరగా నేర్చుకుంటారు. అదే అతని బలం. అతని బిజినెస్ టెక్నిక్స్ , శైలి తనకు ఆశ్చర్యాన్ని కలిగించేవని చెప్పారు. ప్రకటనలకు నిధులు వెచ్చించడానికి అస్సలు ఇష్టపడని రాందేవ్, ఒక సందర్భంలో రూ.4 కోట్ల విలువైన ఒక ప్రకటన కోసం ఆ పత్రిక యజమానికి కేవలం రూ. 2 కోట్ల విలువైన చవన్ ప్రాశ చెల్లింపు ద్వారా తనదైన శైలిలో డీల్ చేశారని గుర్తు చేసుకున్నారు.
కాగా ఎస్.కె. పత్రా, టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ (ఐఐఎంఏ) ఇండియన్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్ధి. 2011-2014 నుండి పతంజలి ఆహార పార్క్ ప్రెసిడెంట్‌గానూ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగాను పనిచేశారు. అంతకుముందు ఎంఎంటిసి లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఎసీఎంఈ టెలీ పవర్ సంస్థలకు పనిచేశారు. మరో ఐఐఎం గ్రాడ్యుయేట్ సి.ఎల్. కమల్ అకస్మాత్తుగా కంపెనీని వీడడంతో ఆయన స్థానంలో పాత్ర ఎంపికయ్యారు. మరోవైపు కెమికల్ ఫ్రీ, పూర్తిగా సాంప్రదాయ బద్ద ఉత్పత్తులు అని ప్రచారం చేసుకునే పతంజలి ఉత్పత్తుల్లో కూడా కాన్సర్ కారక రసాయనాలను భారీగా కనుగొన్నట్టు ఇటీవల నివేదికలు రావడం తెలిసిందే. మరి వీటిపై పతంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.