
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండేకి బోలెడంత మంది అభిమానులు ఉన్నారు.

ప్రముఖ నటుడు చంకీ పాండే కూతురు అనన్య అనే సంగతి తెలిసిందే. అందం, అభినయం పరంగా అనన్యకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.

ఇంత సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతుండటంతో అనన్య తల్లి భావన కూతురుకి ప్రతి వారం దిష్టి తీస్తుంటారట.

ఆ మాటకొస్తే... చిన్నప్పట్నుంచి వారానికోసారి దిష్టి తీయడం ఆమె అలవాటు అట.

ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో అనన్యా పాండే మాట్లాడుతూ – ‘‘ప్రతి శనివారం మా అమ్మ నాకు దిష్టి తీస్తారు.

ఎండు మిరపకాయలు, ఉప్పుతో దిష్టి తీయడం ఆమె అలవాటు. రెంటినీ నా చుట్టూ తిప్పి, తర్వాత మంటలో వేస్తారు. మిరపకాయల నుంచి ఎంత ఘాటు వస్తే అంత దిష్టి ఉన్నట్లు లెక్క.

ఇది మాత్రమే కాదు... నేను ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడల్లా నా చెవి వెనకాల మా అమ్మగారు రెండు నల్లటి చుక్కలు పెడతారు.

చాలామంది నేను సరిగ్గా స్నానం చేయలేదనో లేక ఏదైనా మరక ఏమో అనుకుంటారు. దిష్టి తగలకుండా మా అమ్మ నాకు పెట్టే నల్ల చుక్కలు అవి’’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ (2019)తో వెండితెరకు పరిచయమైన అనన్యా పాండే తొలి చిత్రంతోనే తనలో మంచి నటి ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.

శుక్రవారం విడుదలైన హిందీ చిత్రం ‘సీటీఆర్‌ఎల్’లోని నళిని పాత్రలో అనన్యా పాండే కనబర్చిన అభినయం ఆమెకు ప్రశంసలు తెచ్చిపెడుతోంది.

విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ‘లైగర్’ చిత్రం ద్వారా అనన్యా పాండే తెలుగుకి పరిచయమైన సంగతి తెలిసిందే.













