పట్టపగలు దోపిడీ
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లిలో సోమవారం పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. ట్రాన్స్ కో బిల్లులు వసూలు చేసే కాంట్రాక్ట్ రెవెన్యూ కలెక్టర్‌ను కత్తులతో బెదిరించి రూ.1.19 లక్షలు అపహరించుకుని వెళ్లా రు. బాధితుడి కథనం ప్రకారం.. మంచిర్యాలలోని జన్మభూమినగర్‌కు చెందిన బుజాడి శ్రీనివాస్ బెల్లంపల్లిలో ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్ పద్ధతిన రెవెన్యూ కలెక్టర్(బిల్లులు వసూలు చేసే వ్యక్తి)గా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం స్థానిక బజార్ ఏరియా చిన్నరాజయ్య కాంప్లెక్స్‌లో ఉన్న ట్రాన్స్‌కో కలెక్షన్ సెంటర్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు బిల్లులు వసూలు చేశాడు. అకస్మాత్తుగా శ్రీనివాస్‌కు కడుపులో తిప్పినట్లు కావడంతో బహిర్భూమి కోసం బెల్లంపల్లిబస్తీలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ వద్దకు డబ్బుల బ్యాగుతో వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని బయటకు వస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని ఉన్న నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా శ్రీనివాస్‌ను అటకాయించి కత్తులతో బెదిరించారు.
డబ్బుల బ్యాగ్‌ను లాక్కొని అతడిని పక్కనే నిలిపి ఉంచిన ఆటోలో ఎక్కించుకుని గురిజాలకు వెళ్లే రహదారికి బయల్దేరారు. ఎంపీడీవో కార్యాలయం, ఐటీడీఏ హార్టికల్చర్ మధ్యలో ఆటో నిలిపి శ్రీనివాస్‌ను కిందికి దింపారు. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి బ్యాగ్‌లో ఉన్న రూ.1.19 లక్షలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. ఖాళీ బ్యాగ్‌ను శ్రీనివాస్ చేతిలో పెట్టి క్షణాల్లో అదే ఆటోలో దుండగులు బెల్లంపల్లి వైపు పారిపోయూరు. నిర్ఘాంతపోయి శ్రీనివాస్ కలెక్షన్ సెంటర్‌కు వచ్చి సిబ్బందికి వివరాలు తెలిపాడు. ట్రాన్స్‌కో పట్టణ ఏఈ మల్లేశం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎస్.పి.రవీందర్, వన్‌టౌన్ ఎస్సై కె.స్వామి, ఐడీ పార్టీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.