వంగిపోతున్న యాపిల్ ఐఫోన్ 6
న్యూయార్క్ : మార్కెట్లో విడుదలైన వారంలోనే దుమ్మురేపిన యాపిల్ ఐఫోన్ 6 సమస్యలు ఎదుర్కొంటోంది. ఫోన్ వంగిపోతుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయాయి. ఇప్పటి వరకూ వినియోగదారుల నుంచి తొమ్మిది ఫిర్యాదులను అందుకుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఐ ఫోన్ వివాదంపై యాపిల్ సంస్థ స్పందించింది.
ఐఫోన్ 6, 6 ప్లస్ లను స్టెయిన్ లెస్ స్టీల్, టైటానియంతో అత్యంత నాణ్యతతో డిజైన్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్యాంటు పలుచగానూ, టైట్ గానూ ఉండటం వల్ల వెనక్కి పెట్టినప్పుడు ఐఫోన్ 6 ప్లస్ వంగిపోయి ఉండవచ్చనన్న మొబైల్ నిపుణుల వాదనతో కంపెనీ ఏకీభవించింది. ఎక్కువ సేపు ఐఫోన్‌ను ప్యాంటు వెనక జేబులో పెట్టినప్పుడు ఎలర్ట్ చేస్తుందని దాన్ని పట్టించుకోన్నప్పుడు సమస్యలు వస్తాయని కంపెనీ చెబుతోంది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు మన్నించాలని యాపిల్ సంస్థ ప్రతినిధి కోరారు. ప్రస్తుత వెర్షన్‌ను తర్వలోనే సరిచేస్తామని పేర్కొన్నారు.