జాగింగ్ వార్నింగ్
పరుగుతో జర జాగ్రత్త!
జాగింగ్ వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుందనేది మనకు తెలిసిన ఆరోగ్య సూత్రం. అయితే జాగింగ్ మరీ అలసట కలిగించేదిగా ఉండకూడదు. అలా తీవ్రమైన శ్రమతో శరీరాన్ని అలసటకు లోను చేసే జాగింగ్ వల్ల ఆరోగ్యం సమకూరదని డేనిష్ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. వీరు ప్రతిరోజూ జాగింగ్ చేసే 1,098 మందితో పాటు పన్నెండేళ్ల పాటు అసలు జాగింగ్ చేయని మరో 413 మందిపై నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... అతి తీవ్రంగా శారీరక శ్రమ కలిగేలా చేసే జాగింగ్‌తో ఒనగూరే ప్రయోజనం, అస్సలు జాగింగ్ చేయని వారికి కలిగే ప్రయోజనం ఒకటేనని తేల్చారు.
మంచి ఆరోగ్య ప్రయోజనం పొందాలంటే తేలికపాటి వేగంతో లేదా ఒక మోస్తరు వేగంతో పరుగుతీయాలని పేర్కొంటున్నారు. జాగింగ్ వారానికి 2.4 గంటలకు మించకపోతేనే ఆరోగ్యకరం. తీవ్రంగా చేసే జాగింగ్ వల్ల గుండెకు ప్రయోజనం కలగకపోగా అది గుండె, రక్తప్రసరణ వ్యవస్థలపై తీవ్రమైన భారం పడేలా చేసి, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని తెలిపారు. ఈ విషయాలన్నీ ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.