చంద్రన్నా.. ఇదేందన్నా
ఉచితమని చెత్త సరుకులా?
పట్టించుకోని అధికారులు
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
పుంగనూరు : సంక్రాంతికి చంద్రన్న కానుకగా చెత్త సరుకులు ప్యాకింగ్ చేస్తున్నారు. శెనగల్లో రాళ్లు, చెత్తతో నిండి ఉన్నాయి. వాటిని ఏమాత్రం శుభ్రం చేయకుండా అలాగే ప్యాకెట్లలో నింపుతున్నారు. పుంగనూరు గోడౌన్లో ఆ దృశ్యాలు కనిపించాయి. సంక్రాంతి కానుకగా బెల్లం, నూనే, శెనగలు, గోధుమపిండి, నెయ్యి ప్యాకెట్లను చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం గిఫ్ట్ప్యాక్ రూపంలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలోని 66 మండలాల్లో 2,831 చౌకదుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. చెంద్రన్న కానుకగా జిల్లాలోని 9,84,232 మంది లబ్ధిదారులు ఈ బహుమతులు అందుకోనున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లోని సివిల్సప్ల్లయ్స్ గోదాముల్లో సరుకులను ప్యాకింగ్ చేసే కార్యక్రమం సాగుతోంది. అరకిలో బెల్లం, అరకిలో ఆయిల్, అరకిలో శెనగలు, కిలో గోధుమపిండి, అరకిలో కందిపప్పు, నెయ్యి 100 గ్రాములు ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ మేరకు జిల్లా కేంద్రం నుంచి ఆయా గోదాములకు సరుకులు చేరవేశారు.
చెత్తా చెదారం
ఇక్కడికి అందిన సరుకులు ఏమాత్రం పరిశీలించినట్లు కనిపించడం లేదు. స్థానిక అధికారులు కూడా వీటిని శుభ్రం చేయించడానికి చర్యలు తీసుకోలేదు. వచ్చిన సరుకును తూకాలు వేయకుండా ప్యాకింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాకు నెయ్యి, కందిపప్పు, గోధుమపిండి పూర్తిస్థాయిలో అందకపోవడంతో స్థానిక అధికారులు ఆ పదార్థాలను సేకరించి, ప్యాకింగ్ చేసే కార్యక్రమానికి తంటాలు పడుతున్నారు. ఈ కేంద్రం నుంచి పుంగనూరు, చౌడేపల్లె, రామసముద్రం, పెద్దపంజాణి మండలాలకు సరుకుల ప్యాకెట్లు సరఫరా చేయాల్సి ఉంది.
సరుకులు తక్కువ?
ఇదిలావుండగా జిల్లాకు అవసరమైన మేరకు సరుకులు అందలేదని అధికారవర్గాల ద్వారాా తెలిసింది. ప్రస్తుతం 492 మెట్రిక్ టన్నుల పామాయిల్, 492 మెట్రిక్ టన్నుల బెల్లం, 492 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 985 మెట్రిక్ టన్నుల శెనగపప్పు, 98 మెట్రిక్ టన్నుల నెయ్యి, 985 మెట్రిక్ టన్నుల గోధుమపిండి అందినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకూ వీటిలో 80 శాతం సరుకులను మాత్రమే ప్రభుత్వం సేకరించింది.