నటులపై ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు..
కావేరి నదీ జలాల విషయంలో కన్నడ నటుల ఆందోళనను ఎద్దేవా చేస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు అతన్ని చితకబాదారు. తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో కర్ణాటక భగ్గుమన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగి.. శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ను చేపట్టాయి.
ఈ బంద్ నేపథ్యంలో ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి డీ సంతోష్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టాడు. కావేరి జలాల ఆందోళనలో కన్నడ నటులు శివరాజ్‌కుమార్, 'దునియ' విజయ్, రాగిణి ద్వివేది, దర్శన్ పాల్గొనడాన్ని తప్పుబడుతూ అతను విమర్శలు చేశాడు. అతని పోస్టు కర్ణాటకలో వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన బెంగళూరు స్థానిక యువకులు కొందరు అతన్ని వెతికిమరీ పట్టుకున్నారు. కాలేజీ గేటు వద్ద అతన్ని అటకాయించి చితకబాదారు. ఐదుగురు అతన్ని చుట్టుముట్టి చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.