కర్ణాటకకు వెళ్లొద్దు: అమెరికా
న్యూఢిల్లీ: కావేరి జలాలపై హింస చెలరేగిన కర్ణాటక రాష్ట్రానికి, బెంగళూరు నగరానికి ప్రయాణించవద్దని.. అమెరికా సోమవారం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. బెంగళూరులో పలు ఐటీ కంపెనీలు సహా పెద్ద సంఖ్యలో అమెరికా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే.
‘కావేరి నీటి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరు సహా కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనలతో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని పలుచోట్ల మూసివేశారు. తమిళనాడు వాహనాలపై రాళ్లు రువ్వి, నిప్పు పెట్టారు. బెంగళూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. ఫలితంగా బెంగళూరులోని పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక యంత్రాంగం ప్రకటించిందన’ని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు బెంగళూరు నగరంలో కర్ఫ్యూ విధించిన చోట్ల పోలీసులు, అదనపు భద్రతా బలగాలను మోహరించారు. రాజగోపాల నగర, కామాక్షిపాళ్య, విజయనగర, బ్యాటరాయణపుర, కెంగేరీ, మాగడి రోడ్డు, రాజాజీనగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.