1998 సెప్టెంబర్ 5 నాకు మరుపురాని రాత్రి
కోలకత్తా: నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ ప్రకటించడం పట్ల కోలకత్తా దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ మోనికా బెస్రా (50) సంతోషం వ్యక్తం చేశారు. మానవతామూర్తి, ప్రపంచ శాంతిదూత మదర్ థెరిస్సా తనకు దైవంతో సమానమని ఆమె అభివర్ణించారు. తన అద్భుతమైన శక్తితో క్యాన్సర్ మహమ్మారి నుంచి తనకు విముక్తి కల్పించారని కొనియాడారు. 1998 సెప్టెంబర్ 5వ తేదీ తనకు మరుపురాని రాత్రి అని మోనికా బెస్రా తెలిపారు.
మదర్ ఫోటోనూ చూస్తున్న సందర్భంగా... తెల్లటి కాంతి కిరణాలతో పాటు, అపురూపమైన వెలుగును దర్శించానని మోనికా బెస్రా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతమైన శక్తి ఏదో తనను ఆవహించి స్పృహ కోల్పోయానన్నారు. మరుసటి ఉదయానికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కణాలు నాశనమైపోయాయని బెర్సా తెలిపారు. నిజంగా ఇదొక మర్చిపోలేని అద్భుతమన్నారు. ఈ ఘటనతో మదర్ థెరిస్సాకు సెయిండ్ హుడ్ దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రాణాంతకమైన మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తికి పూర్తిగా ఆరోగ్యం వంతుడిని చేయడాన్ని మొదటి అద్భుతంగా, 17 ఏళ్లుగా ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నమోనికా బెస్రాకు స్వస్థత చేకూరడం రెండవ అద్భుతంగా గుర్తించారు. మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో వీరిద్దరిని దీవించినట్లు పోప్ పేర్కొన్న విషయం విదితమే. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. 2016 సంవత్సరంలో మదర్ థెరిస్సా దైవదూతగా అవతరించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింన సంగతి తెలిసిందే.