పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్‌కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్‌కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్‌ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్‌ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్‌లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్‌ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్‌తో ఈ యూనిట్‌ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్‌టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్‌ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్‌కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్‌లు, ఆస్పత్రి మెటీరియల్స్‌ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్‌ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్‌గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి.